క్రీడలతో శారీరక, మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో శారీరక, మానసికోల్లాసం

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

● కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ● ముగిసిన పోలీస్‌ వార్షిక స్పోర్ట్స్‌ మీట్‌

అల్లిపురం: నిత్యం పనిభారంతో ఉండే ఉద్యోగులకు క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ పేర్కొన్నారు. గెలుపోటములకంటే కలిసి టీమ్‌గా పాల్గొనడం ముఖ్యమని, ఇది అధికారుల మధ్య స్నేహబంధాన్ని బలపరుస్తుందని అన్నారు. విశాఖపట్నం సిటీ పోలీస్‌ విభాగం ఆధ్వర్యంలో సూర్యాబాగ్‌లోని ఆర్మడ్‌ రిజర్వ్‌ మైదానంలో నిర్వహించిన వార్షిక స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈస్ట్‌ గోదావరి జిల్లాలో పనిచేసినప్పుడు జరిగిన క్రీడా పోటీల అనుభవాలు విధి నిర్వహణలో ఎంతో ఉపయుక్తమయ్యాయని తెలిపారు. ఈ స్ఫూర్తితో రెవెన్యూ శాఖలో కూడా త్వరలో క్రీడా పోటీలను నిర్వహించాలని యోచిస్తున్నామని వెల్లడించారు. విశాఖలో ఈ తరహా కార్యక్రమాలు ఒక మంచి సంప్రదాయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ స్పోర్ట్స్‌ మీట్‌లో వెస్ట్‌, సౌత్‌, నార్త్‌, హార్బర్‌, ఈస్ట్‌, ద్వారకా సబ్‌డివిజన్లు, ట్రాఫిక్‌ డివిజన్‌తో పాటు స్పెషల్‌ వింగ్‌ టీమ్‌లు కలిపి మొత్తం పది జట్లు పాల్గొన్నాయి. ప్రారంభంలో జట్లు మార్చ్‌పాస్ట్‌ నిర్వహించి కలెక్టర్‌కు గౌరవ వందనం అందించాయి. 100 మీటర్ల పరుగులు (మెన్‌, ఆఫీసర్స్‌), టగ్‌ ఆఫ్‌ వార్‌ వంటి పోటీలను కలెక్టర్‌ ప్రారంభించి వీక్షించారు. పోలీస్‌ సిబ్బంది చూపిన ఉత్సాహం ప్రశంసనీయమని పేర్కొంటూ, పాల్గొన్న ప్రతి ఒక్కరినీ విజేతలుగానే భావిస్తున్నానన్నారు. మొత్తం 20 విభాగాల్లో నిర్వహించిన 140కు పైగా పోటీల్లో సుమారు 250 మంది విజేతలు, రన్నర్స్‌గా నిలిచారు. అనంతరం విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు. స్పోర్ట్స్‌ మీట్‌ జెండాను కలెక్టర్‌కు అందజేయగా, ఆయన దానిని పోలీస్‌ కమిషనర్‌కు భద్రపరచడానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో సీపీ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement