నో టికెట్‌ | - | Sakshi
Sakshi News home page

నో టికెట్‌

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

ఆన్‌లైన్‌లో మూడో రోజు లభ్యం కానీ చందనోత్సవం టికెట్లు

ఉదయం 6 గంటల నుంచే బ్యాంకుల వద్ద బారులు తీరిన భక్తులు

10 గంటల వరకు ఎండలో నిరీక్షణ.. గంటలోనే టికెట్ల విక్రయం

సింహాచలం: ఈ ఏడాది చందనోత్సవం టికెట్ల జారీనే పెద్ద ప్రహసనంగా మారింది. టికెట్ల కోసం భక్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 70 శాతం ఆన్‌లైన్‌, 30 శాతం ఆఫ్‌లైన్‌ విధానం అమల్లో పూర్తిగా విఫలమైందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు రూ.300, రూ.1000 టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ప్రకటించినప్పటికీ, మూడు రోజులుగా సాఫ్ట్‌వేర్‌ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడం, చెల్లింపులు పూర్తయినా టికెట్లు రాకపోవడం వంటి లోపాలు భక్తులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధికారులు మాత్రం సర్వర్‌ సమస్య.. సరిచేస్తున్నాం.. అనే పాత పాట పాడుతున్నారు.

బ్యాంకుల వద్ద రణరంగం

ఆన్‌లైన్‌ వ్యవస్థ పనిచేయకపోవడంతో భక్తులంతా ఆఫ్‌లైన్‌ కేంద్రాలైన బ్యాంకులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో బ్యాంక్‌కు మంగళవారం కూడా రూ.300 టికెట్లు 700, రూ.1000 టికెట్లు 390 ఇచ్చారు. సింహాచలంలోని యూనియన్‌ బ్యాంకు, స్టేట్‌ బ్యాంకుల వద్ద ఉదయం 6 గంటల నుంచే భక్తులు భారీగా క్యూల్లో నిలబడ్డారు. ఎండలో గంటల తరబడి వేచి చూసినప్పటికీ, ఉదయం 10 గంటలకు ప్రారంభమైన టికెట్ల విక్రయాలు గంటలోపే ముగియడంతో వందలాది మంది నిరాశతో వెనుదిరిగారు. ఒక్కో బ్యాంకుకు పరిమిత సంఖ్యలోనే టికెట్లు కేటాయించడంతో పరిస్థితి మరింత విషమించింది. టికెట్లు దొరకకపోవడంతో భక్తులు బ్యాంకుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వడంపై దేవస్థానం అధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రద్దీ పెరగడంతో పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి నెలకొనగా, పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీంతో వందలాది మంది భక్తులు బ్యాంకుల వద్ద తిట్లదండకాలు మొదలెట్టారు. గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కలిసి భక్తులను నియంత్రించే ప్రయత్నం చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా టెంట్లు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.

ప్రత్యామ్నాయం ఏది?

ఈ పరిణామం మొత్తం నిర్వహణలో ఉన్న లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. భారీ స్థాయిలో భక్తులు వచ్చే చందనోత్సవం వంటి కార్యక్రమాలకు ముందస్తు ప్రణాళికలో లోపాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విఫలం కావడం, ఆఫ్‌లైన్‌ టికెట్ల పరిమితి తక్కువగా ఉంచడం వంటి కారణాలు ఈ పరిస్థితికి దారితీశాయని భావిస్తున్నారు. మొత్తం మీద భక్తులకు సౌకర్యం కల్పించాల్సిన టికెట్‌ విధానం, వారికే ఇబ్బందులు కలిగించేలా మారింది. ఆన్‌లైన్‌ వ్యవస్థ ఫెయిల్‌ అయినప్పుడు, తక్షణమే ఆఫ్‌లైన్‌ కోటాను పెంచి భక్తులకు ఊరటనివ్వడంలో యంత్రాంగం విఫలమైంది. ఇప్పటికై నా అధికారులు పరిస్థితిని సమీక్షించి, ఆన్‌లైన్‌ వ్యవస్థను సరిచేసి, టికెట్ల జారీని పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement