ఉద్యమ నేత రోజారాణికి కడసారి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ నేత రోజారాణికి కడసారి వీడ్కోలు

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

డాబాగార్డెన్స్‌: తెలంగాణ శ్రామిక మహిళా ఉద్యమ నేత(సీఐటీయూ), సీపీఎం ఆ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, న్యూబోయిగూడ నర్సింగ్‌ కాలేజీ ప్రొఫెసర్‌ చక్రవర్తుల రోజారాణి అంతిమ యాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. సోమవారం సాయంత్రం రామాటాకీస్‌ సమీపంలో బస్సు ఢీకొట్టిన ఘటనలో ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. మంగళవారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం, రోజారాణి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం జగదాంబ జంక్షన్‌ సమీపంలోని సిటు కార్యాలయంలో ఉంచారు. సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమెకు ఘన నివాళులర్పించారు. అనంతరం సిటు కార్యాలయం నుంచి కాన్వెంట్‌ జంక్షన్‌ శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించారు.

ఉద్యమ ప్రస్థానం స్ఫూర్తిదాయకం

సీపీఎం జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రోజారాణి మృతి పార్టీకి, ఉద్యమానికి తీరని నష్టమని పేర్కొన్నారు. విశాఖలో విద్యార్థి ఉద్యమంతో ప్రారంభమైన ఆమె ప్రస్థానం, హైదరాబాద్‌ వెళ్లాక సిటు, సీపీఎం ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకుందని కొనియాడారు. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కార్మిక, మహిళా ఉద్యమాల్లో ఆమె చురుకై న పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సిటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, నవతెలంగాణ పత్రిక సీజీఎం పి.ప్రభాకర్‌, సిటు అఖిల భారత నాయకురాలు బేబీరాణి, కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, ఎన్‌.వీరయ్య, ఎం.సాయిబాబా పాల్గొన్నారు. అలా గే తెలంగాణ రాష్ట్ర నర్సింగ్‌ కాలేజీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వి.విద్యుల్లత, కేజీహెచ్‌ నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సత్యవల్లి, తెలంగాణ ట్రైన్డ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు ఎం.రాజేశ్వరి, డాక్టర్‌ కొరటాల అనంత, విశాఖ జిల్లా సీపీఎం నాయకులు పి.మణి, ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, బి.గంగారావు, వి.కృష్ణారావు, జగన్‌ తదితరులు నివాళుల ర్పించారు. రోజారాణి భర్త జె.వెంకటేష్‌, కుమార్తె డాక్టర్‌ ఆకాంక్ష, అల్లుడు డాక్టర్‌ హిమా వంత్‌లను పలువురు నేతలు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తరలివచ్చిన రెండు రాష్ట్రాల సీపీఎం నేతలు

Advertisement
 
Advertisement
Advertisement