అల్లిపురం: నగరంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వారోత్సవాలను ప్రారంభించారు. తొలుత ఆయన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, అగ్నిమాపక అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రాంతీయ అగ్నిమాపక అధికారి నిరంజన్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి కాపు సత్యనారాయణలతో కలిసి సీపీ అగ్నిమాపక సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అగ్నిప్రమాదాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. గతంలో తాను అగ్నిమాపక శాఖ డీజీపీగా పనిచేసిన సమయంలో సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పని చేశానని గుర్తుచేశారు. అనంతరం వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆ తర్వాత అగ్నిమాపక శకటాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ డాబాగార్డెన్స్, అంబేడ్కర్ సర్కిల్, సంగం శరత్ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆశీలమెట్ట, సౌత్ జైలు రోడ్డు, జగదాంబ, టర్నర్ చౌల్ట్రీ మీదుగా సాగి తిరిగి సూర్యాబాగ్‌కు చేరుకుంది. కార్యక్రమంలో ఏడీఎఫ్‌వోలు ఎం.వరప్రసాద్, ఎన్.గోపికృష్ణ, కేవీటీ ప్రసాద్‌తో పాటు అగ్నిమాపక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు


