వైఎస్సార్‌ సీపీ సిద్ధాంతాల్లోనే అంబేడ్కర్‌ భావజాలం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ సిద్ధాంతాల్లోనే అంబేడ్కర్‌ భావజాలం

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

సాక్షి, విశాఖపట్నం/డాబాగార్డెన్స్‌: దేశానికి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అందించిన సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు కొనియాడారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో, అలాగే డాబాగార్డెన్స్‌లోని ఎల్‌ఐసీ కూడలి వద్ద మంగళవారం అంబేడ్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ ఎస్సీ సెల్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొని, బాబాసాహెబ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపీ బాబూరావు మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ భావజాలం వైఎస్సార్‌ సీపీ సిద్ధాంతాల్లోనే ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పాలన సాగించిందని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ ఆశయాలను చిత్తశుద్ధితో అమలు చేసి చూపారని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, చంద్రబాబు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు దళితులపై, ముఖ్యంగా దళిత మహిళలపై దాడులకు తెగబడుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబాసాహెబ్‌ విగ్రహాలకు నివాళులర్పించే నైతిక అర్హత కూటమి నాయకులకు లేదని ఆయన విమర్శించారు.

ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ కుమార్‌, చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణి కుమారి, మాజీ మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ, ముఖ్యనేతలు బొల్లవరపు జాన్‌వెస్లీ, ఐ.హెచ్‌ ఫరూఖీ, పల్లా దుర్గారావు, పేర్ల విజయచందర్‌, ద్రోణంరాజు శ్రీవత్సవ్‌, చెన్నా జానికీరామ్‌, రవిరాజు, అల్లు శంకరరావు, ఎం.సునీల్‌, అల్లంపలి రాజబాబు, అనిల్‌ కుమార్‌రాజు, కర్రి రమారెడ్డి, శ్రీదేవి వర్మ, బొండా ఉమామహేశ్వరరావు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నివాళులర్పించిన బీజేపీ

అంబేడ్కర్‌ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ నివాళులర్పించారు. సామాజిక సమానత్వానికి ప్రాణం పోసిన మహానీయుడు అంబేడ్కర్‌ అని, ఆయన చూపిన మార్గమే దేశానికి దిక్సూచి అని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలను సాకారం చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

బాబా సాహెబ్‌ ఆశయాలు ఆదర్శం

విశాఖ సిటీ: ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) కార్పొరేట్‌ కార్యాలయ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి సంస్థ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్‌, టి.వనజ, సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) టి.వి.సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్‌ కీలక భూమిక పోషించి యావత్‌ జాతికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ కె.వి.రామకృష్ణ ప్రసాద్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు డి.సుమన్‌ కల్యాణి, బి.అశోక్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ దార్శనికత స్ఫూర్తిదాయకం

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(డీసీఐఎల్‌) కార్యాలయంలో సంస్థ ఎండీ, సీఈవో కెప్టెన్‌ ఎస్‌.దివాకర్‌.. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో డీసీఐఎల్‌ పోషిస్తున్న పాత్రకు డాక్టర్‌ అంబేడ్కర్‌ దార్శనికత ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొని బాబాసాహెబ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు.

కస్టమ్స్‌, జీఎస్టీ ఆధ్వర్యంలో..

పోర్టు ప్రాంతంలో కస్టమ్స్‌, జీఎస్టీ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.శ్రీధర్‌, ఇతర అధికారులు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ రాంబాబు, సూపరింటెండెంట్‌ కౌశల్య, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ జి.దానయ్య పాల్గొన్నారు.

ఎంపీ గొల్ల బాబూరావు

రాజ్యాంగ నిర్మాత ఆలోచనలు ఆచరణలో పెట్టాలి

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ పిలుపునిచ్చారు. డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప సామాజిక శాస్త్రవేత్త అని కొనియాడారు. డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement