బంగారం | - | Sakshi
Sakshi News home page

బంగారం

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

బూడిదే
వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ఎన్టీపీసీ సింహాద్రి సరికొత్త రికార్డు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా శత శాతం బూడిద వినియోగం నిర్మాణ రంగానికి ప్రధాన ముడిసరుకు పర్యావరణ పరిరక్షణలో దేశానికి మార్గదర్శకం

వ్యర్థం ‘అర్థవంతం’

విశాఖ సిటీ: ఒకప్పుడు థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి వెలువడే బూడిద అంటే కేవలం వ్యర్థం, పర్యావరణానికి ముప్పు అనే అభిప్రాయం ఉండేది. కానీ సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంట్‌ ఆ భావనను పూర్తిగా మార్చేసింది. కేవలం విద్యుత్‌ ఉత్పత్తిలోనే కాకుండా, వ్యర్థాల నిర్వహణలోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. రెండు తెలుగు రాష్ట్రాలకు విద్యుత్‌ కాంతులు పంచుతున్న ఈ ప్లాంట్‌, పర్యావరణ పరిరక్షణలో దేశంలోని ఇతర ప్లాంట్లకు ఆదర్శంగా నిలుస్తోంది. బొగ్గును మండించి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే క్రమంలో వెలువడే ‘ఫ్లై యాష్‌’ (బూడిద)ను వ్యర్థంగా పారేయకుండా, నిర్మాణ రంగానికి కీలక వనరుగా మలుస్తోంది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా 100 శాతం వినియోగాన్ని సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి నేటి వరకు ఒక్క గ్రాము బూడిదను కూడా వృథా కానివ్వకుండా, ప్రకృతిలో కలవకుండా జాగ్రత్త పడుతోంది.

విద్యుత్‌ ఉత్పత్తిలో అజేయ శక్తి

సింహాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కేవలం పర్యావరణానికే పరిమితం కాకుండా, దక్షిణాది రాష్ట్రాల విద్యుత్‌ గ్రిడ్‌కు వెన్నెముకలా నిలుస్తోంది. 2000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్‌, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి దాదాపు 11,136 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు సింహాద్రి విద్యుత్‌ ఎంతో కీలకంగా మారింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూనే వ్యర్థాల నిర్వహణలో మేటిగా నిలుస్తోంది.

కొండంత బూడిద.. కోటి ప్రయోజనాలు

విద్యుత్‌ ఉత్పత్తి ప్రక్రియలో ఏడాదికి సగటున 2.8 మిలియన్‌ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతోంది. ఇంత భారీ పరిమాణాన్ని నిర్వహించడం ఏ ప్లాంట్‌కై నా సవాలే. గతంలో ఈ బూడిద వల్ల కాలుష్యం పెరిగి సమీప గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, సింహాద్రి యాజమాన్యం దీన్ని ఒక అవకాశంగా మార్చుకుంది. ఉత్పత్తి అయ్యే ప్రతి టన్ను బూడిదను వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. గత ఏడాది ఏకంగా 102 శాతం వినియోగాన్ని సాధించింది. అంటే, ప్రస్తుత ఉత్పత్తితో పాటు పాత నిల్వలను కూడా వినియోగంలోకి తెచ్చింది.

కాలుష్యానికి అడ్డుకట్ట.. నిర్మాణానికి ఊతం

బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే క్రమంలో భారీగా ఫ్లై యాష్‌ వెలువడుతుంది. దీనిని సరిగ్గా నిర్వహించకపోతే గాలిలో కలిసి ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవ్వడమే కాకుండా, భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తుంది. అయితే సింహాద్రి ప్లాంట్‌ ఈ సమస్యను ఒక అవకాశంగా మలిచింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బూడిదను ఏమాత్రం వృథా కాకుండా సిమెంట్‌ పరిశ్రమలకు ముడిసరుకుగా సరఫరా అవుతోంది. పోర్ట్‌ల్యాండ్‌ పోజోలానా సిమెంట్‌ (పీపీసీ) తయారీలో ఈ ఫ్లై యాష్‌ అత్యంత కీలకం. విశాఖపట్నం, సమీప జిల్లాల్లోని సిమెంట్‌ కర్మాగారాలు ఫ్లై యాష్‌పైనే బూడిదపైనే ఆధారపడుతున్నాయి. దీనివల్ల సిమెంట్‌ నాణ్యత పెరగడమే కాకుండా, తయారీ వ్యయం కూడా తగ్గుతోంది.

హరిత శక్తి వైపు అడుగులు

శిలాజ ఇంధనాలతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూనే, మరోవైపు పునరుత్పాదక ఇంధన వనరుల (గ్రీన్‌ ఎనర్జీ) వైపు సింహాద్రి అడుగులు వేస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌ సోలార్‌ (నీటిపై తేలియాడే సౌర విద్యుత్‌ కేంద్రం) ప్రాజెక్టుల్లో ఒకటైన 25 మెగావాట్ల ప్లాంట్‌ ద్వారా సుమారు 39.362 మిలియన్‌ యూనిట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసింది. దీనివల్ల బొగ్గు వినియోగం తగ్గడమే కాకుండా, కార్బన్‌ ఉద్గారాలు కూడా తగ్గుతున్నాయి. రిజర్వాయర్‌ నీటిపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడం వల్ల నీటి ఆవిరీభవనాన్ని కూడా తగ్గించగలుగుతున్నారు. ఇటువంటి వినూత్న ఆలోచనలే సింహాద్రిని ఇతర ప్లాంట్ల కంటే భిన్నంగా నిలబెడుతున్నాయి.

ఒకప్పుడు పర్యావరణానికి ముప్పుగా భావించిన ఫ్లై యాష్‌ను.. సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంట్‌ ఇప్పుడు ఆర్థిక, నిర్మాణ రంగాలకు బలమైన వనరుగా మార్చింది. విద్యుత్‌ ఉత్పత్తితో పాటు వ్యర్థాల నిర్వహణలోనూ సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.

హైవేల నిర్మాణంలో కీలక పాత్ర

రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణంలో కూడా సింహాద్రి బూడిద వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణంలో మట్టికి ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. రోడ్ల పునాదిలో బూడిదను వాడటం వల్ల అవి మరింత దృఢంగా మారుతున్నాయి. దీంతో మట్టి కోసం కొండలను తవ్వాల్సిన అవసరం తగ్గి, పర్యావరణ పరిరక్షణకు దోహదం అవుతోంది. అనకాపల్లి–ఆనందపురం హైవే వంటి కీలక ప్రాజెక్టుల్లో ఈ బూడిదను విస్తృతంగా వినియోగించారు. అలాగే ఇటుక తయారీ యూనిట్లకు తక్కువ ధరకే లేదా ఉచితంగా బూడిద అందించడం ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. లోతట్టు ప్రాంతాలను పూడ్చడానికి, గనుల పునరుద్ధరణ పనులకు కూడా ఈ బూడిదను వినియోగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement