గ్యాస్‌ మాఫియా జుగల్‌బందీ | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ మాఫియా జుగల్‌బందీ

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

● సామాన్యుడికి దొరకని సిలిండర్‌ ● దళారుల చేతిలో బందీ ● వోటీపీ మాయాజాలం ● హోటళ్లు, రెస్టారెంట్లకు యథేచ్ఛగా సరఫరా

మహారాణిపేట : యుద్ధం సృష్టించిన అల్లకల్లోలం సామాన్యుడి వంటగదిని ఖాళీ చేస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని గ్యాస్‌ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్‌ కుమ్మక్కై సాగిస్తున్న ఈ ‘బ్లాక్‌’ దందా పతాక స్థాయికి చేరింది. సామాన్య వినియోగదారులకు అందాల్సిన సిలిండర్లు దారి మళ్లి హోటళ్లు, రెస్టారెంట్ల పాలవుతున్నాయి. అధికార వర్గాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంలో వోటీపీ అనే రక్షణ కవచం తుత్తునియలైంది. వినియోగదారుడు సిలిండర్‌ బుక్‌ చేసుకుని, వోటీపీ మొబైల్‌కు వచ్చినా 15 రోజుల వరకు సరఫరా జరగడం లేదు. అదనంగా రూ. 500 నుంచి రూ. 800 చెల్లించే వారికి మాత్రం ఎటువంటి వోటీపీ అవసరం లేకుండానే గంటల వ్యవధిలో సిలిండర్‌ గుమ్మం ముందుకు వస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వ్యాపార సంస్థలు రూ.1000 నుంచి రూ.2000 వరకు ముట్టజెబుతుండటంతో, గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లు భారీ ఎత్తున వాణిజ్య అవసరాలకు మళ్లుతున్నాయి.

నిలిచిన బుకింగ్‌లు.. అందని టోల్‌ ఫ్రీ సేవలు

నగరంలో గ్యాస్‌ బుకింగ్‌ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. అధికారిక టోల్‌ ఫ్రీ నంబర్లు పనిచేయకపోవడం, ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. కష్టపడి బుక్‌ చేసుకున్నా కన్ఫర్మేషన్‌ రాదు, ఒకవేళ వచ్చినా సిలిండర్‌ రాదు. గ్యాస్‌ ఏజెన్సీల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నా, లోపల మాత్రం ఇబ్బడిముబ్బడిగా సిలిండర్ల లోడింగ్‌ అక్రమ మార్గాల్లో సాగిపోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement