ఆన్‌లైన్‌ గందరగోళం.. బ్యాంకుల్లో నిరాశ | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గందరగోళం.. బ్యాంకుల్లో నిరాశ

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

సరిగ్గా పనిచేయని

ఆన్‌లైన్‌ విధానంతో గగ్గోలు

బ్యాంకుల్లో గంటలోపే టికెట్లు ఖాళీ

70:30 విధానం అమల్లో

లోపాలు బహిర్గతం

సామాన్య భక్తులకు ఇబ్బందుల మోత

సింహాచలం: సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేళ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్న ప్రభుత్వ, అధికార యంత్రాంగం మాటలు క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మిగిలాయి. ఉత్సవానికి వారం రోజుల ముందే భక్తులకు టికెట్ల కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది 70 శాతం టికెట్లను ఆన్‌లైన్‌లో, 30 శాతం ఆఫ్‌లైన్‌ (బ్యాంకుల) ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం భక్తులకు వరానికి బదులు శాపంగా మారింది.

మొరాయించిన వెబ్‌సైట్‌..

కట్‌ అవుతున్న నగదు

రూ.300, రూ.1000 దర్శన టికెట్లు ఈనెల 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. తీరా చూస్తే తొలిరోజే వెబ్‌సైట్‌ పూర్తిగా మొరాయించింది. గంటల తరబడి కంప్యూటర్లు, మొబైల్స్‌ ముందు వేచి చూసిన భక్తులకు నిరాశే ఎదురైంది. సోమవారం వెబ్‌సైట్‌ కొంతవరకు అందుబాటులోకి వచ్చినా, సాంకేతిక లోపాలు వీడలేదు. నగదు కట్‌ అవుతున్నా టికెట్లు రావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకుల వద్ద క్యూలు.. గంటలోనే ఖాళీ

నగరంలోని నాలుగు బ్యాంకు బ్రాంచీల (సింహాచలం, అక్కయ్యపాలెం యూనియన్‌ బ్యాంకులు; సింహాచలం, బిర్లా జంక్షన్‌ స్టేట్‌ బ్యాంకులు) ద్వారా సోమవారం నుంచి ఆఫ్‌లైన్‌ విక్రయాలు ప్రారంభమయ్యాయి. టికెట్ల కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. అయితే, విక్రయాలు మొదలైన గంట వ్యవధిలోనే టికెట్లు అయిపోయాయని సిబ్బంది బోర్డులు తిరగేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరకొర టికెట్లే కారణమా?

దేవస్థానం ఈవో జె. వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం.. తొలిరోజు సింహాచలంలోని యూనియన్‌ బ్యాంకుకు 1090 (700 – రూ.300 టికెట్లు, 390 – రూ.1000 టికెట్లు), స్టేట్‌ బ్యాంకుకు 1090 టికెట్లు మాత్రమే కేటాయించారు. వీటిలోనే కొన్నిటిని ఇతర బ్రాంచీలకు పంపారు. గతంలో నగరం అంతటా దాదాపు 20 బ్యాంకుల ద్వారా టికెట్లు విక్రయించేవారు. కానీ ఈసారి బ్యాంకుల సంఖ్యను తగ్గించి, ఆన్‌లైన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం భక్తుల పాలిట ఇబ్బందిగా మారింది.

అటు ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు, ఇటు బ్యాంకుల్లో అరకొర టికెట్లతో సామాన్య భక్తులు అప్పన్న దర్శనం కోసం అల్లాడిపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి టికెట్ల సంఖ్యను పెంచాలని, సాంకేతిక లోపాలను సరిదిద్దాలని భక్తులు కోరుతున్నారు.

చందనోత్సవం ‘టికెట్‌’ కష్టాలు

Advertisement
 
Advertisement
Advertisement