విశాఖ సిటీ: విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సదుపాయాలు, స్టేషన్ ప్రాంగణంతో పాటు రైళ్లలో పరిశుభ్రతను పర్యవేక్షించేందుకు వాల్తేరు డివిజన్ ఏడీఆర్‌ఎం (ఆపరేషన్స్) కె.రామారావు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలు, ప్లాట్‌ఫారమ్‌లు, ఇక్కడి నుంచి బయలుదేరే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఆయన సందర్శించారు. ప్రధానంగా మంచినీటి వసతి, ఫుడ్ కోర్టులు, క్యాటరింగ్ స్టాల్స్, బుకింగ్, రిజర్వేషన్ కార్యాలయాలను పరిశీలించారు. వెయిటింగ్ గదుల్లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల ఆరా తీశారు. స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఆర్పీఎఫ్, టికెట్ తనిఖీ సిబ్బంది తీసుకుంటున్న రద్దీ నియంత్రణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైళ్లలో ప్రయాణించే వారికి అందించే లినెన్ (బెడ్ షీట్లు, దుప్పట్లు) నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా క్లీనింగ్ సిబ్బంది, లినెన్ సరఫరాదారులతో ఆయన మాట్లాడారు. ప్రయాణికులు ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించాలని, అందరితో మర్యాదగా, వినమ్రంగా మాట్లాడాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల సంతృప్తే రైల్వే శాఖ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. తనిఖీల అనంతరం విశాఖ స్టేషన్‌లోనే ఆన్‌బోర్డ్ హౌస్ కీపింగ్ సిబ్బంది, సూపర్‌వైజర్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లతో ఏడీఆర్‌ఎం ప్రత్యేక కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించకూడదని, స్టేషన్, రైళ్ల పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఆదేశించారు.


