మహారాణిపేట: జనగణన–2027 ప్రక్రియలో భాగంగా ‘స్వీయ గణన’ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. తొలిసారిగా ప్రజలే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని ఈ నెల 16 నుంచి 30 వరకు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల పౌరులు నిర్ణీత గడువులోగా httpr@//re.cenr ur,gov.in పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం తరఫున 15 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కార్మికులు ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులకు సూచించారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రోజుకు కనీసం 10 నుంచి 20 మందికి సహాయం అందించాలని పేర్కొన్నారు. ఈ స్వీయ గణన పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరిపైనా ఒత్తిడి చేయరాదని స్పష్టం చేశారు.


