బూట్లు ఉతకలేదని భార్యపై దాడి | - | Sakshi
Sakshi News home page

బూట్లు ఉతకలేదని భార్యపై దాడి

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

● కేజీహెచ్‌లో బాధిత మహిళను పరామర్శించిన వైఎస్సార్‌ సీపీ నేతలు అనురాధ, పేడాడ రమణికుమారి ● నిందితుడిపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు

● కేజీహెచ్‌లో బాధిత మహిళను పరామర్శించిన వైఎస్సార్‌ సీపీ నేతలు అనురాధ, పేడాడ రమణికుమారి ● నిందితుడిపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు

మహారాణిపేట: నగర పరిధిలోని ఆర్‌అండ్‌బీ జంక్షన్‌ వద్ద గల భీమ్‌ నగర్‌లో ఒక వ్యక్తి తన భార్యపై అత్యంత పశుప్రాయంగా దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీవాణి అనే వివాహితపై ఆమె భర్త కొల్లి రామనాయుడు రక్తం వచ్చేలా కిరాతకంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లె అనురాధ, జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు పెనుమత్స శ్రీదేవి వర్మ సోమవారం కేజీహెచ్‌ను సందర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించిన నేతలు, ఆమె ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీవాణికి 2021లో రామనాయుడుతో వివాహం జరిగిందని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. భర్త చాలా కాలంగా ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడని, తాజాగా మద్యం మత్తులో ఉన్న రామునాయుడు బూట్లు ఉతకలేదనే చిన్న కారణంతో బెల్టుతో విచక్షణారహితంగా కొట్టాడని మండిపడ్డారు. అంతటితో ఆగక ఆమె పీకపై కాలు వేసి నొక్కి తీవ్రంగా హింసించాడని, తండ్రి తన తల్లిని ఏ విధంగా హింసించాడో పిల్లలు చెబుతుంటే హృదయం రగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మహిళా నేతల బృందం పోలీస్‌ కమిషనర్‌ శంకబ్రత బాగ్చిని కలిసి నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పేలా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సీపీని కోరారు. వైఎస్సార్‌ సీపీ తరఫున బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు పార్వతి, దక్షిణ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు బంగారమ్మ, పద్మజ, లక్ష్మి, రోజాకుమారి, రమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement