బస్సు ప్రమాదంలో మహిళ మృతి
బీచ్ రోడ్డు: రామా టాకీస్ జంక్షన్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన రోజా రాణి (55) అనే మహిళ మృతి చెందారు. మూడో పట్టణ ట్రాఫిక్ పోలీస్ సిఐ అమ్మి నాయుడు తెలిపిన వివరాలు ప్రకారం..అనారోగ్యంతో ఉన్న తన సోదరుడిని పరామర్శించేందుకు విశాఖ వచ్చిన ఆమె, మరో సోదరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై మందులు తీసుకురావడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్తున్న వీరి వాహనాన్ని బస్సు ఢీకొట్టడంతో.. రోజా రాణి అదుపుతప్పి బస్సు వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహనం నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.


