అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

● పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ● 334 వినతులు స్వీకరించిన అధికార యంత్రాంగం

మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చే వినతులకు అధికారులు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి, ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఏడీసీ సత్యవేణి ప్రజల నుంచి మొత్తం 334 వినతులు స్వీకరించారు. ఇందులో జీవీఎంసీకి సంబంధించి 83, రెవెన్యూ 59, పోలీస్‌ 23, ఇతర శాఖలకు చెందిన 169 వినతులు ఉన్నాయి. రెవెన్యూ క్లినిక్‌లో ఆర్డీవోలు శేష శైలజ, సంగీత మాధూర్‌, తహసీల్దార్లు ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు.

టీడీఆర్‌ ఇప్పించండి మహాప్రభో

మధురవాడ రేవళ్లపాలేనికి చెందిన కోండా భీమాలింగేశ్వరరావు తన గోడును పీజీఆర్‌ఎస్‌లో వెళ్లబోసుకున్నారు. రోడ్డు విస్తరణలో తన 532 గజాల స్థలంలో 200 గజాలు కోల్పోయానని, అయితే అధికారులు కేవలం 100 గజాలకే టీడీఆర్‌ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన 100 గజాలకు టీడీఆర్‌ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదని, ఇటీవల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చి మంచానికే పరిమితమైనా అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. తనకు రావాల్సిన 1.4 టీడీఆర్‌ను తక్షణమే మంజూరు చేయాలని ఆయన అధికారులను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement