కణమంలో ఆటోనగర్‌ నిర్మాణం చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

కణమంలో ఆటోనగర్‌ నిర్మాణం చేపట్టాలి

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

మహారాణిపేట : ఆనందపురం మండలం కణమం గ్రామంలో తక్షణమే ఆటో నగర్‌ నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కార్మికులు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. విశాఖపట్నం ఆటో స్పేర్‌ పార్ట్స్‌ అండ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు జీవీఎంసీ నుంచి కలెక్టరేట్‌ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కర్రి గణేష్‌, సీఐటీయూ నాయకుడు కర్రి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ఆటో నగర్‌ నిర్మాణం కోసం కణమం గ్రామంలో 157.77 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 2019లోనే జీవో నంబర్‌ 49 జారీ అయిందని గుర్తు చేశారు. నిధులు కేటాయించినప్పటికీ ఏపీఐఐసీ అధికారులు, జిల్లా యంత్రాంగం పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తూ కార్మికులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

స్మార్ట్‌ సిటీ పేరుతో రోడ్ల పక్కన ఉన్న బడ్డీలు, వర్క్‌షాపులను తొలగించడంతో సుమారు 20 వేల కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆటో నగర్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కర్రి గణేష్‌, సీఐటీయూ నాయకులు కర్రి చంద్రశేఖర్‌, ఉప్పులూరి హేమ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ వద్ద కార్మికుల భారీ నిరసన

Advertisement
 
Advertisement
Advertisement