దూరవిద్యపై నిపుణుల చర్చ
మద్దిలపాలెం: విద్యలో నాణ్యత, సామర్థ్యాల పెంపు అత్యంత ముఖ్యమని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆచార్యులు, వైసిఎంఓయూ (నాసిక్) పూర్వ వీసీ ఆచార్య ఇ. వాయునందన్ తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యా వారసత్వ వేడుకలు–భవిష్యత్తు దిశగా.. పునాదుల నుంచి ప్రగతి వరకు’ అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారసత్వం–మైలురాళ్లు, సార్వత్రిక, దూరవిద్య పరిణామ క్రమం, సవాళ్లు–అవకాశాలు, భవిష్యత్తు దార్శనికత, సమాజంపై ప్రభావం వంటి అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సార్వత్రిక విద్య విధానం పనితీరు, ప్రగతి, సవాళ్లను విశ్లేషించారు. ప్యానెల్ చర్చకు సంబంధించిన సమగ్ర డాక్యుమెంట్ సిద్ధం చేయాలని ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్ సూచించారు. సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ అధికారి, ఏయూ దూరవిద్య కేంద్రం పూర్వ సంచాలకులు ఆచార్య డి.హరినారాయణ, ఇగ్నో రీసెర్చ్ యూనిట్ పూర్వ డైరెక్టర్ సి.ఆర్.కె. మూర్తి , ఇగ్నో (న్యూఢిల్లీ) ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం డైరెక్టర్ ఆచార్య వి.వి.సుబ్రహ్మణ్యం, ఎలక్ట్రానిక్ మీడియా ప్రొడక్షన్ సెంటర్ పూర్వ అదనపు డైరెక్టర్ డాక్టర్ రవి అయ్యగారి, ఏయూ సీడీవో ఈ సంచాలకులు ఆచార్య డి.ఏ.నాయుడు ప్రసంగించారు.


