సీఎస్‌ఆర్ నిధులకు
కార్పొరేట్ సామాజిక బాధ్యత ఖర్చులను తన ఖాతాలో వేసుకుంటున్న సర్కార్ పీ4 కోసం దాతలు ముందుకొచ్చారంటూ ప్రచార ఆర్భాటం ఏటా జరిగే సాధారణ ఖర్చులనే పీ4 విజయాలుగా చిత్రీకరణ
ఇవిగో లెక్కలు
క్రెడిట్
బాబు
సాక్షి, విశాఖపట్నం: పేదరిక నిర్మూలన కోసం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్(పీ4) విధానాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ పథకానికి ఆశించిన స్పందన రాకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతోంది. పీ4ను ప్రతిష్టాత్మక పథకమని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రిని మెప్పించేందుకు అటు మంత్రులు, ఇటు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఏదో ఒక లెక్క చూపి, అది పీ4 సాధించిన విజయమేనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పలు సంస్థలు తమ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కింద కేటాయిస్తున్న నిధులను కూడా పీ4 ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా పీ4 గణాంకాలు చూస్తుంటే నవ్వి పోదురుగాక.. నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది. ఇందులో ‘క్రెడిట్ చోరీ’ స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు అదానీ గంగవరం పోర్టు సంస్థ కలెక్టరేట్ భవన మరమ్మతులకు రూ.50 లక్షల సాయం అందించింది. దీనిని కూడా పీ4 పేదరిక నిర్మూలన కింద జమ కట్టారు. బక్కన్నపాలెం వద్ద ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.13.83 లక్షలు కేటాయించింది. దీనిని కూడా పీ4 పథకం గొప్పతనంగానే ప్రచారం చేస్తున్నారు.
పని ఒకరిది.. పేరు మరొకరిది!
దివీస్ ఫౌండేషన్, హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్, ఐవోసీఎల్ వంటి సంస్థలు దశాబ్దాలుగా విశాఖ పరిసర ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎన్టీపీసీ నుంచి అదానీ పోర్టు వరకు అన్ని సంస్థలు కంపెనీల చట్టం ప్రకారం తమ లాభాల్లో నిర్ణీత శాతాన్ని సీఎస్‌ఆర్ కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంగన్‌వాడీలకు రంగులు వేయడం, ఆసుపత్రులకు పరికరాలు అందించడం వంటివి ఏళ్ల తరబడి జరుగుతున్న ప్రక్రియలే. అయితే, ఈ పనులన్నీ చంద్రబాబు పిలుపుతోనే, పీ4 పథకంలో భాగంగానే జరుగుతున్నాయని పబ్లిసిటీ చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అట్టర్ ఫ్లాప్ షోను కవర్ చేసుకునేందుకు.. పాత కార్యక్రమాలకే కొత్త పేర్లు పెట్టి సక్సెస్ స్టోరీగా చిత్రీకరిస్తూ.. కలెక్టరేట్ యంత్రాంగం ప్రకటన విడుదల చేయడం జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏళ్ల నాటి సేవలకు కొత్త రంగులు
కంపెనీల చట్టం 2013 ప్రకారం.. నిర్ణీత టర్నోవర్ ఉన్న ప్రతి సంస్థ సామాజిక సేవలకు నిధులు ఖర్చు చేయడం చట్టబద్ధమైన బాధ్యత. దివీస్ సంస్థ గత పదేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు రూ. 300 కోట్లు ఖర్చు చేసింది. భీమిలి ప్రాంతంలో అంగన్‌వాడీల ఆధునికీకరణ వంటి పనులు గత నాలుగేళ్లుగా నిరంతరం జరుగుతున్నవే. అలాగే ఎన్టీపీసీ, ఐవోసీఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ లాభాల్లో 2 శాతం నిధులను సామాజిక సేవకే కేటాయిస్తున్నాయి. గత ఐదేళ్లలో కేజీహెచ్ అభివృద్ధి కోసం దాదాపు రూ.100 కోట్లకు పైగా సీఎస్‌ఆర్ నిధులను వివిధ కంపెనీలు వెచ్చించాయి. తాజాగా ఎన్టీపీసీ రూ.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించింది. కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థ తన పరిధిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిత్యం జరిగే ఈ కార్యక్రమాలను కూడా పీ4 సాధించిన విజయంగా చూపడం అధికారులకే నవ్వు తెప్పిస్తోంది.
అంకెల్లో మాయాజాలం
జిల్లాలో 66,103 కుటుంబాలను దత్తత తీసుకున్నారని, వారికి రూ. 20.86 కోట్ల సాయం అందిందని ప్రభుత్వం చెబుతున్న గణాంకాల్లో పస లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీ4 పథకం ద్వారా కొత్తగా సృష్టించిన ఆస్తి ఏది? ఈ పథకం రాకముందు సంస్థలు చేసిన ఖర్చుకు, ఇప్పటి ఖర్చుకు తేడా ఏంటి? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. పేదరిక నిర్మూలన అంటే పాత నిధులను కొత్త లెక్కల్లో చూపడం కాదు, కొత్త ఉపాధి మార్గాలు సృష్టించడం. కానీ ఇక్కడ జరుగుతున్నది కేవలం అంకెల మాయాజాలం మాత్రమే. చిత్తశుద్ధి లేకుండా కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ఈ అంకెల గారడీ చేస్తున్నారని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీ
p4
p4


