పేదలపై ప్రతాపం.. జనసేనకు దాసోహం | - | Sakshi
Sakshi News home page

పేదలపై ప్రతాపం.. జనసేనకు దాసోహం

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

● ప్రభుత్వ స్థలంలో జనసేన నేత జిమ్‌ ● రూ.10 కోట్ల విలువైన స్థలం స్వాహా? ● పట్టించుకోని జీవీఎంసీ, విద్యుత్‌ శాఖ అధికారులు

డాబాగార్డెన్స్‌: నగర నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి బహిరంగంగా కబ్జాకు గురవుతున్నా జీవీఎంసీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్‌ లంగ్స్‌ పేరుతో రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులపై బుల్డోజర్లతో ప్రతాపం చూపిన అధికారులు.. అధికార పార్టీ నాయకుల ఆక్రమణల విషయంలో మాత్రం మౌనం దాల్చడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

రూ.10 కోట్ల స్థలం ఆక్రమణ

జీవీఎంసీ 33వ వార్డు పరిధిలోని ఎంజీఎం హైస్కూ ల్‌ వద్ద సుమారు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన మాజీ కార్పొరేటర్‌ భీశెట్టి వసంతలక్ష్మి భర్త ఆక్రమించి దర్జాగా షెడ్డు వేశారు. అంతేకాకుండా అందులో ఓ జిమ్‌ సెంటర్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆక్రమణపై స్థానిక నాయకులు ముత్తాబత్తుల రమేష్‌, పచ్చిరపల్లి రాము తదితరులు జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు.

ప్రజా భద్రతకు ముప్పు

జీవీఎంసీ 31, 32, 33, 34 వార్డుల ప్రజల తాగునీటి అవసరాల కోసం గత ప్రభుత్వం ఇక్కడ భారీ ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ను నిర్మించింది. ప్రస్తుతం జనసేన నాయకుడు ఈ ట్యాంక్‌ ఆనుకునే షెడ్డు వేశారు. సరైన రక్షణ కంచె, సీసీ కెమెరాలు లేని ఈ ట్యాంక్‌ పైకి ఎవరైనా సులభంగా ఎక్కే ప్రమాదం ఏర్పడింది. దీని వల్ల ప్రజలకు సరఫరా అయ్యే తాగునీటికి భద్రత కరువైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ అక్రమ జిమ్‌కు జీవీఎంసీ పంప్‌ హౌస్‌ నుంచే దర్జాగా విద్యుత్‌ను వాడుకుంటున్నా ఈపీడీసీఎల్‌ అధికారులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement