మహారాణిపేట: నగరంలో విద్యనభ్యసిస్తున్న ఇద్దరు ఇరానీ మహిళలకు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో రూ.1,50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. శనివారం కలెక్టరేట్‌లోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. నగరంలో ఫార్మసీ విద్యను అభ్యసించడానికి వచ్చిన జైనాబ్ మొహమ్మది, సల్మా మొహమ్మది అనే ఇద్దరు మహిళలు యుద్ధం కారణంగా తమ దేశం నుంచి డబ్బు అందక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వారికి అండగా నిలిచి ఈ ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఇరానీ మహిళలు మాట్లాడుతూ.. గత పది రోజులుగా తమ కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయని, వారి ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో తమను ఆదుకున్నందుకు వారు భావోద్వేగానికి లోనై కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మక్కా మసీద్ అధ్యక్షుడు ఎస్.కె.అబ్దుల్ మునీర్, కార్యదర్శి సయ్యద్ అమీర్ జాన్, హాజీ విక్రమ్ అలీ, చిరాగ్ అలీ, షకీల్, అహ్మద్ అలీ, ఇనియతుల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు.


