ఈనెల 30 వరకు గడువు
డాబాగార్డెన్స్: 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నును ఈ నెల 30వ తేదీలోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఎంసీ పరిధిలోని ఆస్తిపన్నుదారులు, గృహ యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ కేతన్‌గార్గ్ ఒక ప్రకటనలో కోరారు. అలాగే, 2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. బకాయిలను ఏకమొత్తంలో చెల్లించే వారికి ఈ వెసులుబాటు కలుగుతుందని వివరించారు. నగర పరిధిలోని యజమానులు జీవీఎంసీ సౌకర్య కేంద్రాల్లో నగదు, డీడీ, చెక్కు లేదా డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా పన్ను చెల్లించవచ్చు. అలాగే ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలనుకునే వారు gvmc.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి e-payment-PropertyTax-VacantLand Tax-Assessment Number(New/Old)లో వివరాలను నమోదు చేసి సులభంగా చెల్లింపులు చేయవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.


