ఆలయాల ఆర్కిటెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆలయాల ఆర్కిటెక్ట్‌

Apr 11 2026 9:52 AM | Updated on Apr 11 2026 9:52 AM

300 ఆలయాలకు రూపశిల్పి

చామర్తి బాల భాస్కరన్‌

దేశ, విదేశాల్లో గుర్తింపు పొందిన

కొమ్మాది వాసి

యూనిక్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ చోటు

లయాలకు ప్లానింగ్‌ ఇవ్వడమంటే ఆషామాషీ కాదు. సర్వ శాస్త్రాలపై లోతైన అవగాహన ఉండాలి. ఇందులో కొమ్మాది అన్నంరాజు నగర్‌కు చెందిన డాక్టర్‌ చామర్తి బాల భాస్కరన్‌ స్థపతిది ప్రత్యేక స్థానం. వాస్తు శాస్త్రంలో ఆయన చూపిన ప్రతిభకు గాను యూనిక్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ప్రపంచంలోనే తొలి శిల్ప, ఆగమ శాస్త్ర సర్టిఫైడ్‌ స్థపతిగా ఆయన రికార్డు సృష్టించారు. విజయనగర, కాకతీయ, చాళుక్య, హొయసల వాస్తు, శిల్ప శాస్త్రాల్లోనే కాకుండా ఆగమ శాస్త్రాల్లోనూ ఆయన నిష్ణాతులు. ఆయన సేవలను గుర్తించిన ఢిల్లీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయగా.. ఆంధ్ర రత్న, శిల్ప ఆగమ కళా ప్రపూర్ణ, కళారత్న వంటి ఎన్నో బిరుదులు ఆయన్ని వరించాయి.

ఆధ్యాత్మిక కుటుంబ నేపథ్యం

టీటీడీ ఆగమ సలహాదారులు, దివంగత చామర్తి జగ్గప్పలాచార్యులు, పద్మప్రియ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చామర్తి శ్రీధర స్వామి కొమ్మాది శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ప్రధాన అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నారు. రెండవ కుమారుడు డాక్టర్‌ చామర్తి బాల భాస్కరన్‌ వారసత్వంగా వచ్చిన ఆధ్యాత్మికతను శాస్త్రబద్ధంగా పుణికిపుచ్చుకున్నారు. ఏపీ దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆగమ(అర్చక) పరీక్షల్లో (ప్రవేశ, వర, ప్రవర) ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. 2004–09 సంవత్సరాల మధ్య టీటీడీ వారి శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయిక ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థలో వాస్తు, శిల్ప శాస్త్రాలను అభ్యసించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో శిల్ప, ఆగమ శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉన్న ఏకై క పట్టభద్రుడిగా ఆయన రికార్డ్‌ సృష్టించారు.

భవిష్యత్‌ ప్రాజెక్ట్‌లు

బిహార్‌–జార్ఖండ్‌ సరిహద్దులోని మంద్రగిరి పర్వతంపై శ్రీరామచంద్రుడు ప్రతిష్టించిన శివలింగానికి అద్భుతమైన ఆలయ నిర్మాణ ప్లానింగ్‌ చేస్తున్నారు. కెనడా(అల్బెర్టా)లో శ్రీ వైకుంఠం వేదిక్‌ సెంటర్‌, కాంచీపురంలో శ్రీవిద్యా లెర్నింగ్‌ సెంటర్‌, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సమీపంలో 108 శ్రీవైష్ణవ దివ్యదేశ సహిత రంగనాథ పెరుమాళ్‌ క్షేత్ర నిర్మాణం, పశ్చిమ బెంగాల్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాజెక్టు, అనకాపల్లి జిల్లా రావికమతంలో శ్రీ పరిమళ రంగనాథ దివ్యక్షేత్రం నిర్మాణం, వైకుంఠగిరిపై ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన సూర్యనారాయణ స్వామి ఆలయ డిజైన్లలో ఆయన బిజీగా ఉన్నారు.

ప్లానింగ్‌లో ప్రత్యేకత

పురాతన రాజప్రాసాద పద్ధతిలో, వాస్తు పురుష మండల ఆధారంగా శాస్త్ర ఉల్లంఘన లేకుండా ప్లానింగ్‌ ఇవ్వడం బాల భాస్కరన్‌ ప్రత్యేకత. పురాతన శిల్ప శాస్త్రానికి ఆధునిక రీతులను జోడిస్తూ, ఎక్కడా శాస్త్ర ఆక్షేపణ లేకుండా ఆయన డిజైన్‌ చేస్తారు. కేవలం నిర్మాణాలకే పరిమితం కాకుండా.. అత్యంత అరుదైన రథ నిర్మాణం గురించి తెలుగులో ‘రథ లక్షణ భాస్కరం’ అనే బృహత్‌ గ్రంథాన్ని ఆయన రచిస్తున్నారు. ఆగమ, వాస్తు, శిల్ప, పురాణ, ఇతిహాసాల్లోని గూఢ విషయాలను ఈ గ్రంథం ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు చామర్తి తెలిపారు.

నాన్నే నాకు స్ఫూర్తి

మా నాన్న చామర్తి జగ్గప్పలాచార్యులే నాకు స్ఫూర్తి. ఆయన బాటలోనే నడుస్తూ, భగవంతుని సేవ చేయడం, ఆలయాలకు డిజైన్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారంతో గౌరవించడం బాధ్యతను మరింత పెంచింది.

– డాక్టర్‌ చామర్తి బాల భాస్కరన్‌ స్థపతి

సొంతిల్లు నిర్మించుకోవాలంటేనే వాస్తు, సౌకర్యాల గురించి వంద రకాలుగా ఆలోచిస్తాం. అలాంటిది సాక్షాత్తూ ఆ భగవంతుడు కొలువుదీరే ఆలయాన్ని నిర్మించాలంటే ఇంకెంత నైపుణ్యం ఉండాలి? కేవలం ప్లానింగ్‌ ఉంటే సరిపోదు.. వాస్తు, శిల్ప, ఆగమ శాస్త్రాలపై సంపూర్ణ పట్టు ఉండాలి. ఆ అరుదైన నైపుణ్యంతో దేశవ్యాప్తంగా ఏకంగా 300 ఆలయాలకు ప్లానింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు కొమ్మాదికి చెందిన డాక్టర్‌ చామర్తి బాల భాస్కరన్‌ స్థపతి. అడుగడుగునా

తనదైన ముద్ర వేస్తూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని సైతం అందుకున్న ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణం మీకోసం.. – కొమ్మాది

దేశవిదేశాల్లో దివ్య క్షేత్రాలు

దేశవ్యాప్తంగా పలు ప్రసిద్ధ ఆలయాలకు డాక్టర్‌ చామర్తి ప్లానింగ్‌ ఇచ్చారు. వాటిలో కాకినాడలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, తిరుపతిలో శ్రీ విజయగణపతి ఆలయం, శ్రీకాకుళంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, హైదరాబాద్‌లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, ఛత్తీస్‌గఢ్‌లో శ్రీ విజయగణపతి ఆలయం, ఒడిశాలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, చత్తీస్‌గఢ్‌లో శ్రీ గంగా కై లాసనాథ క్షేత్రం, జగిత్యాల జిల్లా పెంబట్ల శ్రీ వాసవీ మహా సంస్థానం, భీమిలిలోని శ్రీ హయగ్రీవ మందిరం వంటి ఎన్నో ఆలయాలను ఆయన డిజైన్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement