తాటిచెట్లపాలెం: అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మృత్యువు అంచులకు వెళ్లిన ఒక వృద్ధురాలిని సీతమ్మధార కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కాపాడారు. వరుసగా మూడుసార్లు గుండె ఆగిపోయినా, నిపుణులైన వైద్య బృందం సమష్టిగా కృషి చేసి ఆమెకు పునర్జన్మ ప్రసాదించారు. విశాఖకు చెందిన 62 ఏళ్ల మహిళ డయాబెటిస్, శ్వాసకోస సమస్యలు, ఆహారం తీసుకోకపోవడం వంటి సమస్యలతో జనవరి 21న ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆసుపత్రికి వచ్చే సరికి పరిస్థితి విషమంగా ఉంది. హిమోగ్లోబిన్ స్థాయి 6.4 గ్రాములకు పడిపోవడంతో పాటు కిడ్నీ సమస్యలు కూడా ఉన్నాయి. చికిత్స పొందుతున్న సమయంలో ఆమెకు వేర్వేరు సందర్భాల్లో మూడుసార్లు గుండె ఆగిపోయింది. ఐసీయూ నిపుణులు వెంటనే స్పందించి సీపీఆర్, ఎలక్ట్రిక్ షాక్ చికిత్స ద్వారా ఆమెను కాపాడారు. వెంటిలేటర్ సపోర్ట్, డయాలసిస్, ఊపిరితిత్తుల చికిత్స కోసం చేసిన ట్రాకియోస్టమీ వంటి క్లిష్టమైన ప్రక్రియల తర్వాత ఆమె క్రమంగా కోలుకున్నారు. ఐసీయూ చీఫ్ డాక్టర్ ఐ.రామకృష్ణ, ఫిజీషియన్ డాక్టర్ బి.వి.ఎన్.రావు నేతృత్వంలో కార్డియాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ వంటి వివిధ విభాగాల వైద్యులు డాక్టర్ మహేష్, డాక్టర్ చలపతిరావు, డాక్టర్ శ్రీనివాస్, ఆర్.కె.మహేష్, డాక్టర్ చరణ్, డాక్టర్ భరత్, డాక్టర్ దిలీప్, డాక్టర్ రోహిత్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ కౌసత్య, డాక్టర్ రమ్య, డాక్టర్ మోహనసాయి సమన్వయంతో పని చేసి ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రోగి స్పృహ కోల్పోకుండా వైద్యులకు సహకరించడం విశేషమని వారు తెలిపారు. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.
కిమ్స్ వైద్యుల సమష్టి విజయం


