గోపాలపట్నం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపట్నం నాయుడు క్వార్టర్స్ సమీపంలోని నరసింహ సినిమా హాలు వద్ద సుమారు 50 ఏళ్ల వయసు గల ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ వ్యక్తి యాచన చేస్తూ జీవించేవాడని, కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు. అనారోగ్యం కారణంగానే అతను మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వీఆర్వో సోనియా సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో కిందపడి మరొకరు..
గోపాలపట్నం బంక్ సెంటర్ చేపల బజారు వద్ద గుడ్డి శ్రీను(60)గా పిలవబడే వ్యక్తి మృతి చెందాడు. అతని అసలు పేరు, పూర్తి వివరాలు తెలియరాలేదు. స్థానిక చేపల బజారు వద్ద చిన్నపాటి పనులు చేసుకుంటూ, వచ్చిన డబ్బుతో మద్యం సేవించి అక్కడి తోపుడు బళ్లపై నిద్రిస్తుండేవాడు. గత నెల 31న మద్యం మత్తులో కింద పడిపోవడంతో శ్రీను తలకు తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు 108 వాహనంలో అతడిని కేజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మృతుల వివరాలు తెలిసిన వారు గోపాలపట్నం పోలీసులను సంప్రదించవచ్చు.


