పీఎంపాలెం: మరొకరి మోజులో పడి.. ప్రియుడిని హతమార్చి.. తెలివిగా దానిని ఆత్మహత్యగా చిత్రించబోయిన ఓ యువతి కథ అడ్డం తిరిగింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో ఆమెతో పాటు సహకరించిన మరో ఇద్దరు కటకటాల పాలయ్యారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పీఎంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ బాలకృష్ణ వెల్లడించారు. అప్పుఘర్ ప్రాంతానికి చెందిన వంట మాస్టర్ ఉమాశంకరరావు (51), మధురవాడ శివశక్తినగర్‌కు చెందిన 28 ఏళ్ల రాజాన రాజేశ్వరి గత 13 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఉమాశంకరరావుకు అప్పటికే వివాహం జరిగింది. అయి తే, ఇటీవల రాజేశ్వరి మరొక వ్యక్తితో సాన్నిహిత్యం పెంచుకుంది. కొత్త ప్రియుడి రాకతో పాత ప్రియుడు ఉమాశంకరరావును ఆమె నిర్లక్ష్యం చేసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తన దారికి అడ్డుగా ఉన్న ఉమాశంకరరావును వదిలించుకోవాలని నిర్ణయించుకున్న రాజేశ్వరి, అతడిని హతమార్చేందుకు పథకం వేసింది. ఇందుకోసం తన సోదరుడు వాసు, మధురవాడ కళానగర్‌కు చెందిన వారాడ తేజల సహాయం తీసుకుంది. ఈ నెల 1వ తేదీన ఉమాశంకరరావును శివశక్తినగర్‌లోని తన ఇంటికి రప్పించి, ముగ్గురూ కలిసి అతడిని హతమార్చారు. అనంతరం అతను ఉరివేసుకున్నట్లు నమ్మించి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య రాజేశ్వరికి కూడా అదే విషయం చెప్పారు. అయితే, తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతని మృతిపై అనుమానం ఉందని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినప్పటికీ, సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిజాన్ని వెలికితీశారు. రాజేశ్వరి, ఆమె తమ్ముడు వాసు, స్నేహితుడు తేజ కలిసి ఈ హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తన భర్తను పొట్టనబెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని ఉమాశంకరరావు భార్య రాజేశ్వరి డిమాండ్ చేస్తున్నారు.
ప్రియుడి హత్య కేసులో ప్రియురాలు,
తమ్ముడు సహా ముగ్గురి అరెస్ట్


