కేజీహెచ్‌లో నర్సులు vs వార్డు బాయ్స్‌ | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌లో నర్సులు vs వార్డు బాయ్స్‌

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

● విచారణ కమిటీ వేసిన సూపరింటెండెంట్‌ ● ఆందోళన విరమించి విధులకు హాజరైన సిబ్బంది

మహారాణిపేట: కేజీహెచ్‌లో కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు, వార్డు బాయ్స్‌ మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. ఈ ఘటనపై కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి స్పందిస్తూ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించారు. దీంతో ఇరు వర్గాల వారు తమ ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం రాజేంద్రప్రసాద్‌ వార్డులో విధుల్లో ఉన్న స్టాఫ్‌ నర్సు పైడిరాజుకు, మేల్‌ వార్డు బాయ్‌ అప్పలస్వామికి మధ్య వాదోపవాదం చోటుచేసుకుంది. తన మనవరాలికి సరైన వైద్యం అందించడం లేదనే విషయమై అప్పలస్వామి ఆవేదన వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో.. తమ వర్గాలకు మద్దతుగా నర్సులు, క్లాస్‌–4 ఉద్యోగుల సంఘాలు గురువారం సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ ఘటనపై విచారణ జరిపి, తప్పు ఎవరిదైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి హామీ ఇచ్చారు. ఈ మేరకు జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ సత్యవరప్రసాద్‌, డీసీఎస్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ కుమార్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుమతిలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆమె ఆదేశించారు. ఆందోళనలో ఏపీ కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు, క్లాస్‌–4 ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నీలాపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement