జూన్‌ నాటికి ఏడు రహదారులు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

జూన్‌ నాటికి ఏడు రహదారులు సిద్ధం

Apr 10 2026 9:39 AM | Updated on Apr 10 2026 9:39 AM

విశాఖ సిటీ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం నాటికి వీఎంఆర్‌డీఏ చేపట్టిన ఏడు రహదారులు అందుబాటులోకి వస్తాయని ఎంపీ శ్రీభరత్‌ తెలిపారు. గురువారం ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధానంగా నిర్మిస్తున్న ఏడు ప్రధాన రహదారుల పనులను వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, కమిషనర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌తో కలిసి పరిశీలించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ రహదారుల నాణ్యతను పరీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్‌ మీడియాతో మాట్లాడుతూ తిమ్మాపురం–మారికవలస రోడ్డు పనులు శతశాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. అడవివరం–శొంఠ్యాం రహదారిలో కొంత భాగం అటవీ శాఖ పరిధిలో ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటి వరకు 41.67 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. నేరేళ్లవలస–కొత్తవలస 65 శాతం, బోయపాలెం–కాపులుప్పాడ 66 శాతం, వేపగుంట–పినగాడి 35 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌ మాట్లాడుతూ ఏడు ప్రధాన రహదారులను జూన్‌ మొదటి వారం నాటికి పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు తెలిపారు. మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌ మాట్లాడుతూ రహదారి నిర్మాణంలో ప్రభావితమైన కట్టడాల యజమానులకు ఇప్పటికే 80 శాతం టీడీఆర్‌లు ఇచ్చినట్లు చెప్పారు. గంభీరం వద్ద మేజర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కొంత సమయం పడుతుందని, అయితే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మిగిలిన పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ సీఈ వినయ్‌కుమార్‌, ఎస్‌ఈలు భవానీశంకర్‌, మధుసూధనరావు, ఈఈ దుర్గా ప్రసాద్‌, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement