
దేవమాత మోక్షారోపణ మహోత్సవాలు ప్రారంభం
కంచరపాలెం: జ్ఞానాపురంలోని సెయింట్ పీటర్ పునీత పేతురు ప్రధాన దేవాలయంలో శతాబ్దకాలంగా నిర్వహిస్తున్న దేవమాత మోక్షారోపణ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ జోన్నాడ జాన్ ప్రకాష్ దివ్యబలి పూజ, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరియమాత ఏ విధంగా ఏసుక్రీస్తుకు చిత్తానుసారంగా జీవించి లోకానికి తల్లిగా మారిందో ఆయన వివరించారు. అనంతరం పారిస్ పాస్టోరల్ కౌన్సిల్ (పీపీసీ) ఆధ్వర్యంలో పీపీసీ అధ్యక్షుడు శ్రీముసురు రాజేష్‌బాబు దేవమాత పతాకాన్ని ఆవిష్కరించారు. సెబాస్టియన్ కాలనీ, బిషప్ మరియదాస్ కాలనీ, మదర్‌థెరిస్సా కాలనీ, రావులపల్లి, వడిచర్ల, నికోలస్, డయాస్, రాసా వీధుల్లో దేవమాత తేరును భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. కార్యక్రమంలో చర్చి ఫాదర్లు ఎస్.వియల్రాజ్, వై.ప్రేమ్‌కుమార్, పీపీసీ సభ్యులు, గురు మండలి సలహా సంఘం సభ్యులు, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.