
కరెంట్ షాక్‌తో సర్వీసింగ్ బాయ్ మృతి
వాటర్ సర్వీసింగ్ సెంటర్‌లో విషాదం
మర్రిపాలెం: ఐటీఐ జంక్షన్‌లోని వాటర్ సర్వీసింగ్ సెంటర్‌లో కరెంటు షాక్‌తో సర్వీసింగ్ బాయ్ మృతి చెందాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలివి. సిద్ధార్థనగర్‌లో నివాసం ఉంటున్న బి.రమణ (41) ఐటీఐ జంక్షన్ వద్ద కుంచమాంబ వాటర్ వాష్ సర్వీసింగ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో రమణ సర్వీసింగ్ సెంటర్‌కు వచ్చాడు. అదే సమయంలో కారు సర్వీసింగ్‌కు వచ్చిన ఓ వ్యక్తి టీ తాగడానికి వెళ్లాడు. అతను తిరిగి వచ్చి చూసేసరికి కారు కింద నీళ్లు వస్తుండగా.. రమణ కింద పడి ఉన్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుడు రమణకు భార్య సత్యవతి, కుమారులు జశ్వంత్, సుశ్చిత్ ఉన్నారు. జశ్వంత్ ఐటీఐ, సుశ్చిత్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. అతని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.