
ఇన్‌స్టిట్యూషన్ లీగ్ విజేత సిటీ పోలీస్
విశాఖస్పోర్ట్స్/మద్దిలపాలెం: వీడీసీఏ ఆధ్వర్యంలో జరిగిన ఇన్‌స్టిట్యూషన్ లీగ్ ఫైనల్‌లో సిటీ పోలీస్ జట్టు విజయం సాధించింది. ఏపీఈపీడీసీఎల్ జట్టుపై 52 పరుగుల తేడాతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది. పీఎంపాలెంలోని వైఎస్సార్ స్టేడియం బీ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన సిటీ పోలీస్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఎంవీపీ ట్రాఫిక్ కానిస్టేబుల్ తొల్లాడ రాజు 96 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు. ఏపీఈపీడీసీఎల్ బౌలర్లలో కార్తీక్ 4 వికెట్లు తీశాడు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఏపీఈపీడీసీఎల్ జట్టు 17.3 ఓవర్లలో కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ అభిషేక్ 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సిటీ పోలీస్ జట్టు బౌలర్ సురేష్ 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా రాజును మద్దిలపాలెంలోని ట్రాఫిక్ అవుట్‌పోస్టులో ఎంవీపీ ఎస్‌ఐ వి.కనకారావు సత్కరించారు.