
కదంతొక్కిన పెన్షనర్లు
బీచ్‌రోడ్డు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు 2025లో భాగంగా సీసీఎస్ పెన్షన్ రూల్స్‌కు చేసిన చట్ట సవరణలకు వ్యతిరేకంగా పెన్షనర్లు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చైర్మన్ రెడ్డి వెంకటరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ బీజేపీ ప్రభుత్వం పెన్షనర్లకు పెన్షన్ పెంచకుండా ఎగ్గొట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే పెన్షన్ చట్టానికి సవరణలు చేసిందని, ఇది పెన్షనర్లను కొత్త, పాత అని విభజిస్తోందని, ప్రస్తుత పెన్షనర్లకు నష్టం కలిగిస్తుందని అన్నారు. ఏఐబీడీపీఎస్ జిల్లా కార్యదర్శి, ఫోరం చైర్మన్ కె.రామాంజనేయులు మాట్లాడుతూ ఈ చట్టం చెల్లుబాటుకు వ్యతిరేకంగా ‘ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్స్’ సుప్రీంకోర్టులో కేసు వేస్తోందని తెలిపారు. న్యాయపరమైన చర్యలతో పాటు, వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయాలని, అందులో భాగంగానే మొదటి చర్యగా మానవహారం నిర్వహించామని అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్, ఆర్‌ఎంఎస్, సెంట్రల్ పెన్షనర్స్, ఎన్‌ఎస్‌టీఎల్, ఈఎన్‌సీపీడబ్ల్యూఏ, ఇన్‌కమ్ టాక్స్, సెంట్రల్ ఎకై ్సజ్, కస్టమ్స్, సీపీడబ్ల్యూడీ, జీఐసీ, ఏఐపీఆర్‌పీఏ, కేంద్రీయ విద్యాలయాలతో సహా వివిధ పెన్షనర్ల సంఘాల నుండి సుమారు 200 మంది పెన్షనర్లతోపాటు ఎం. చంద్రశేఖరరావు, ఎస్.ఎం. మౌలాలి, పి. గోపాలకృష్ణ, కె.వి. రామకృష్ణ, సంజీవరెడ్డి, అప్రాఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.