
జీతాలు మహాప్రభో!
జిల్లాలో ఇటీవల బదిలీ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. బదిలీ ప్రక్రియ పూర్తి చేసుకుని కొత్త స్థానాల్లో విధుల్లో చేరినప్పటికీ.. జీతాలు చెల్లించకుండా అవస్థల పాల్జేస్తోంది. జూన్ నెల జీతం ఇప్పటికీ జమ కాకపోగా.. జూలై నెల జీతం కూడా అందడం కష్టమేనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలను సాకుగా చూపి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఇది తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టడమేనని ఉద్యోగులు వాపోతున్నారు. విద్యాశాఖ, ట్రెజరీ విభాగాల మధ్య సమన్వయ లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
బదిలీల పేరుతో చుక్కలు
సాధారణ బదిలీల్లో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయిలో తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, వీఆర్వోలు భారీ సంఖ్యలో బదిలీ అయ్యారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. బదిలీలపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ.. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ రెవెన్యూలో బదిలీలను కొనసాగిస్తున్నారు. అయితే బదిలీ అయిన టీచర్లకు సంబంధించినంత వరకు.. గత నెల 15వ తేదీ నాటికే ప్రక్రియ పూర్తయింది. అయినప్పటికీ చాలా మంది ఉపాధ్యాయులకు నేటికీ కొత్త పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. ఈ సాంకేతిక కారణంతోనే జూన్‌కు రావాల్సిన జీతం ఆగిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆగస్టు మొదటి వారంలో అందాల్సిన జూలై జీతం కూడా వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఒకవైపు ఉపాధ్యాయులంతా బోధనేతర కార్యక్రమాల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం ఒకటే యాప్‌లో విభిన్నమైన కార్యక్రమాలను చేయమని చెప్పి బోధన కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తోంది. మరోవైపు జీతాలు చెల్లించకుండా ఆర్థికంగా ఇబ్బందులు పెడుతోందని వాపోతున్నారు.
ఉద్యోగుల గోడు పట్టదా?
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి జూన్, జూలై నెలల్లో అధికంగా ఖర్చులు ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూలు ఫీజులు, పుస్తకాలు, ఇతర సామగ్రి కోసం వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు బదిలీ అయిన ప్రాంతానికి కుటుంబంతో సహా మారడానికి రవాణా ఖర్చులు, కొత్త ఇంటి అడ్వాన్సులు, నెలవారీ అద్దెలు అదనపు భారంగా మారాయి. వ్యవసాయ నేపథ్యం ఉన్న ఉద్యోగులకు విత్తనాలు, ఎరువులు, దుక్కుల వంటి ఖర్చులు కూడా ఉంటాయి. ఇలాంటి కీలక సమయంలో జీతాలు సకాలంలో అందకపోవడంతో నెలవారీ ఈఎంఐలు, వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలకు సంబంధించిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఒకవైపు బదిలీల భారం, మరోవైపు జీతాలు ఆగిపోవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యో గులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో యూ టీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇటీవల డీఈవో కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తమ జీతాలను విడుదల చేయాలని వారు కోరుతున్నారు.
విద్యాశాఖ, ట్రెజరీ నిర్లక్ష్యం
విద్యాశాఖ, ట్రెజరీ శాఖల వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పిల్లల చదువు, ఇతర అవసరాల కోసం ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఈ నేపథ్యంలో జీతాలు రాకపోవడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే పొజిషన్ ఐడీలను కేటాయించి, జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలి. – టి.ఆర్.అంబేడ్కర్,
జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్
బదిలీ అయిన ఉద్యోగులకు
అందని జీతాలు
టీచర్, రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి
దారుణం
టీచర్లకు ఐడీ కేటాయింపులో జాప్యం
జీతాల కోసం 2వేల మంది ఎదురుచూపులు
‘ఓడెక్కే వరకు ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కూటమి ప్రభుత్వ తీరు. ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఉద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. బదిలీల ప్రక్రియను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బందికి జీతాలు నిలిపివేసి వారిని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. సమన్వయ లోపం, పరిపాలనా వైఫల్యంతో సుమారు 2 వేల మంది ఉద్యోగులు జీతం కోసం ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించింది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే వేతనాలు అందక.. ఉద్యోగ కుటుంబాలు పడుతున్న వేదన ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోంది. – మహారాణిపేట

జీతాలు మహాప్రభో!