
పంజా!
రైతుల భూములపై
పూలింగ్
మొత్తం 1941.19 ఎకరాల సమీకరణ
● రైతులకు ఇచ్చేది 900, 450 గజాలు మాత్రమే ● అసైన్డ్ భూముల హక్కులు కల్పించేలా చేసిన వైఎస్ జగన్ ● ఇప్పుడు పూలింగ్ పేరుతో కాజేస్తున్న ప్రభుత్వం
ఏయే ప్రాంతాల్లో ఎంత భూమి అంటే...!
గ్రామం పేరు మండలం సర్వే ప్రతిపాదిత నంబరు ల్యాండ్‌పూలింగ్
విశాఖపట్నం
గిడిజాల ఆనందపురం 258 309.18
గోరింట ఆనందపురం 108 198.31
శొంఠ్యాం ఆనందపురం 347పి 251.55
బి.డి.పాలెం ఆనందపురం 1 122.53
కొవ్వాడ పద్మనాభం 237 250.52
మొత్తం విస్తీర్ణం 1,132.09
విజయనగరం జిల్లా
మోదవలస డెంకాడ 241, 242, 243 20.41
రావాడ భోగాపురం 64–1 5.00
మొత్తం విస్తీర్ణం 25.41
అనకాపల్లి జిల్లా
అంతకాపల్లి సబ్బవరం –– 175.42
బాటజంగాలపాలెం సబ్బవరం –– 141.01
ఎ.సిరసపల్లి సబ్బవరం –– 371.75
నల్లరేగుడుపాలెం సబ్బవరం –– 27.37
పైడివాడ అగ్రహారం సబ్బవరం –– 28.14
తగరంపూడి అనకాపల్లి –– 40.00
మొత్తం విస్తీర్ణం 783.69
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
పేద రైతులకు భూమి దక్కాలనే ఉద్దేశంతో అసైన్డ్ భూములపై సర్వాధికారాలు కట్టబెడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్లు దాటిన అసైన్‌దారులకే పూర్తి హక్కులు కల్పించేలా నిషేధిత జాబితా నుంచి ఎత్తివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆదేశాలపై నిషేధాన్ని అమలుచేస్తోంది. గత ఏడాది కాలంగా ప్రతీ మూడు నెలలకు ఒకసారి నిషేధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ నిషేధం మాటున రైతుల భూములపై పూలింగ్ పేరుతో పంజా విసిరేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు అనుగుణంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు విజయనగరం జిల్లాలను కలుపుకొని ఏకంగా 1,941.19 ఎకరాల భూమిని పూలింగ్ పేరుతో సమీకరించేందుకు విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీకి(వీఎంఆర్‌డీఏ) అధికారాలను అప్పగించింది. తద్వారా రైతులకు కేవలం 450 గజాల నుంచి 900 గజాలు మాత్రమే ఇచ్చి.. మిగిలిన భూమితో వ్యాపారం చేసేందుకు తయారవుతోంది. అంతేకాకుండా ఇప్పటికే కొందరు కూటమి నేతలు పూలింగ్ పేరుతో సమీకరించనున్న కొన్ని ముఖ్యమైన సర్వే నెంబర్లలోని రైతులతో ముందస్తు బలవంతపు ఒప్పందాలు చేసుకొని.. నామమాత్రంగా పైసలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే విమర్శలున్నాయి.
భూసమీకరణ పేరుతో భూకబ్జా..!
వాస్తవానికి విశాఖపట్నం సమీప ప్రాంతాల్లో భూమి ధర ఎక్కువగా ఉంది. ఎకరా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ పలుకుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మరింతగా ధరలు పెరుగుతున్నాయి. ఇక్కడ పేద రైతులకు అనేక ప్రాంతాల్లో గతంలో అసైన్‌మెంటు కమిటీల ద్వారా పట్టాలు మంజూరు చేశారు. ఆయా భూముల్లో రైతులు సాగుచేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిషేధం ఎత్తివేయడంతో ఈ భూములను విక్రయించుకునేందుకు అవకాశం వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో పేద రైతుల భూములను కాజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసైన్ చేసిన రైతులకు దక్కేది 900 గజాలు మాత్రమేనని పేర్కొంటోంది. ఇక పదేళ్ల కంటే ఎక్కువ కాలంగా సాగు చేసుకుంటున్న రైతులకు 450 గజాల స్థలం ఇస్తామని చెబుతోంది.
కన్నేసిన కూటమి నేతలు...!
ల్యాండ్ పూలింగ్ వల్ల అసైన్‌దారులు నష్టపోనున్నారు. కేవలం 450, 900 గజాల స్థలంతో సరిపెట్టుకోవాల్సి రానుంది. ఇప్పటికే కూటమిలోని కీలక నేతలకు ఏయే ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ జరగనుందనే దానిపై పక్కా సమాచారం ఉంది. దీంతో బాగా విలువైన ప్రాంతాల్లోని సర్వే నెంబర్లలో గల రైతులతో ముందస్తుగా బెదిరింపులకు దిగి.. ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ‘మీ పట్టా భూములు మాకు అప్పగించండి... మీకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఇస్తామంటూ’ కీలక ప్రాంతాల్లోని భూములకు సంబంధించి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేతో పాటు ఒక కార్పొరేషన్ చైర్మన్, ఓ మంత్రి, ఎంపీ, చినబాబులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతుల నుంచి తక్కువ ధరకు తీసుకుని పూలింగ్ పేరుతో వచ్చే 900 గజాల స్థలాన్ని కూడా కూటమి నేతలే కాజేసేందుకు రంగం సిద్ధమైంది.
రైతులకు హక్కు దక్కకుండా...!
వాస్తవానికి 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న అసైన్‌దారులకు పూర్తి స్థాయిలో వారికే హక్కులు దక్కే విధంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, అందులో ఏదో జరిగిపోయిందనే రీతిలో కూటమి ప్రభుత్వం ప్రచారం చేసింది. ఇప్పటికే రెండు దఫాలుగా పలువురు అధికారులతో విచారణ కూడా చేపట్టింది. ఎలాగైనా తప్పులు ఎత్తిచూపాలనే ఉద్దేశంతో ఒత్తిడి తెచ్చి మరీ విచారణ చేపట్టింది. అయినప్పటికీ ఒక్క చిన్న తప్పు కూడా జరగలేదని తేలింది. అయినప్పటికీ విశాఖలో భూములు దోచుకున్నారంటూ విషప్రచారం చేశారు. తీరా విచారణలో తేలకపోయినప్పటికీ నిషేధాన్ని మాత్రం కొనసాగిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు భూసమీకరణ పేరుతో పేదల భూములను కాజేసేందుకు వీఎంఆర్‌డీఏ రూపంలో ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవేళ గత ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసి ఉంటే.. రైతులకు తమకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలను విక్రయించుకునేందుకూ అవకాశం దక్కేది. ఇప్పుడు కేవలం 900, 450 గజాల స్థలానికి మాత్రమే పరిమితం కావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.