
తల్లిదండ్రులు, వృద్ధులను గౌరవిద్దాం
మహారాణిపేట: తల్లిదండ్రులు, వృద్ధులను ప్రేమతో, గౌరవంగా చూసుకోవాలని హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులు యువతకు పిలుపునిచ్చారు. వారి సంక్షేమం, సంరక్షణ కోసం రూపొందించిన 2007 తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల పోషణ– సంక్షేమ చట్టం గురించి అందరూ తెలుసుకోవాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన ఒకరోజు వర్క్‌షాప్‌లో హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధులు, పోలీసు, రెవెన్యూ, ఇతర జిల్లా స్థాయి అధికారులు ఈ చట్టం అమలు, అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా హెరిటేజ్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్ట్ చదలవాడ ప్రసాద్, న్యాయవాది కొంగారపు గణపతి మాట్లాడుతూ వృద్ధులకు కార్యాలయాలు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లలో సులభంగా సేవలు అందించాలన్నారు. ప్రత్యేక అవసరాల్లో వారికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ చట్టం అమలులో ఆర్డీవోలు ట్రిబ్యునల్ అధికారిగా వ్యవహరిస్తారని, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారన్నారు. 60 రోజుల్లో సమస్య పరిష్కారం కాని పక్షంలో కలెక్టర్‌ను అప్పీలేట్ ట్రిబ్యునల్‌గా సంప్రదించవచ్చని తెలిపారు. సివిల్ కోర్టు పరిధిలోని ఫిర్యాదుల్లో ట్రిబ్యునల్ జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 80 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. గిఫ్ట్ డీడ్ విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని పేర్కొన్నారు.
వృద్ధుల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక ఓపీ
కేజీహెచ్ ఆర్‌ఎంవో బంగారయ్య మాట్లాడుతూ వయో వృద్ధుల సౌకర్యార్థం ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక ఓపీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వృద్ధులు, బిచ్చగాళ్లు అనారోగ్యంతో వస్తే వారికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
టైమ్ బ్యాంక్‌లో చేరాలి
వయో వృద్ధులకు సహాయపడేందుకు విశాఖలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలవుతున్న టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛందంగా చేరాలని నిర్వాహకులు కోరారు. 2019లో ప్రారంభమైన ఈ విధానం దేశంలోని పలు నగరాల్లో అమలవుతోందని, విశాఖలోని 12 పిన్‌కోడ్ లాగిన్ ఏరియాల్లో అందుబాటులో ఉందని వివరించారు. ఇందులో ఆర్థిక లావాదేవీలు ఉండవని, పరస్పర సహకారం మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండినవారెవరైనా ఇందులో చేరవచ్చని, వివరాలకు 94403 01311ను సంప్రదించవచ్చని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, హిజ్రాలు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ ఏడీ కవిత, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
2007 తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల
పోషణ– సంక్షేమ చట్టంపై అవగాహన