
మాక్ డ్రిల్‌లో నిర్లక్ష్యం
బాలికకు తీవ్రగాయాలు
కూర్మన్నపాలెం: స్థానిక యాదవ జగ్గరాజుపేటకు సమీపంలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా అపశ్రుతి చోటుచేసుకొంది. ఈ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఒక బాలిక తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బీడీఎల్ సంస్థలో మంగళవారం రాత్రి అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ముందున్న రహదారిపై వాహనాలను నిలిపివేశారు. అప్పటికే సంస్థలో పెద్ద శబ్దాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో ఎస్‌టీబీఎల్‌లో నివాసముంటున్న బొమ్మిడి సురేంద్రవర్మ తన కుమార్తె మనశ్రీ(8)ని తీసుకొని వెళ్తూ వాహనాలు నిలిపివేయడంతో అక్కడ ఆగిపోయాడు. ఇంతలో పెద్ద శబ్దం రావడం వెంటనే బాంబులోని ఒక రవ్వ లాంటిది మనశ్రీ ముఖంపై పడడంతో తీవ్ర గాయమైంది. తక్షణమే ఆ బాలికను కూర్మన్నపాలెంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అటు పోలీసులు గాని ఇటు సంస్థ యాజమాన్యం గాని పట్టించుకోకపోవడంపై బాలిక కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎమ్మెల్యే గణబాబు బుధవారం ఆసుపత్రికి వెళ్లి ఆ బాలికను పరామర్శించారు.