అధికారులకు అగ్నిపరీక్ష | - | Sakshi
Sakshi News home page

అధికారులకు అగ్నిపరీక్ష

Aug 3 2025 8:52 AM | Updated on Aug 3 2025 8:52 AM

అధికారులకు అగ్నిపరీక్ష

అధికారులకు అగ్నిపరీక్ష

ప్రభుత్వ వైఖరిపై మేధావుల ప్రశ్నలు

ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను తప్పించుకుని సంపన్నులపైకి నెడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల హక్కుగా ప్రభుత్వమే వారి సంక్షేమాన్ని నేరుగా చూడాలి. ఆ బాధ్యతను దాతలకు అప్పగించడం పేదల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పథకాలను నూరు శాతం పారదర్శకంగా అమలు చేస్తే.. పీ–4 వంటి పథకాల అవసరమే ఉండదని వారు సూచిస్తున్నారు. మరొకరి ద్వారా సహాయం అందించడం పేదలను వారి దయదాక్షిణ్యాలకు వదిలేయడమేనని, ఇది భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహారాణిపేట: పేదలను ఉన్నత స్థాయికి తీసుకువస్తామని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ‘పబ్లిక్‌–ప్రైవేట్‌–పీపుల్‌ పార్టనర్‌షిప్‌’(పీ–4) పథకం అమలుకు కిందా మీదా పడుతోంది. ఉగాది సందర్భంగా అట్టహాసంగా మొదలైన ఈ పథకం.. సంపన్న వర్గాల నుంచి స్పందన లేకపోవడంతో ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. దీంతో ప్రభుత్వం సర్వేలు, పునఃపరిశీలనల పేరుతో కాలయాపన చేస్తోంది. మరోవైపు ఆగస్టు 15వ తేదీలోగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ప్రభుత్వం ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. దీంతో జిల్లా స్థాయి అధికారులు దాతలను అన్వే షించాలని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.

ఆసక్తి చూపని సంపన్న వర్గాలు

సంపద సృష్టిస్తామని, పేదరికాన్ని రూపుమాపుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ‘సామాజిక బాధ్యత’అంటూ సంపన్నుల వెంటపడుతున్నారు. బంగారు కుటుంబాలను తీర్చిదిద్దాలని.. ఆ మేరకు పేద వర్గాలను దత్తత తీసుకోవాలని ప్రాథేయపడుతున్నారు.ఆ పిలుపునకు సంపన్న వర్గాలెవరూ ముందుకు రావడం లేదు. సీఎం పిలుపునకు ఆ పార్టీ నాయకులు కూడా స్పందించడం లేదు. కాగా.. ఈ పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 73,452 బంగారు కుటుంబాలను నాలుగు దశల్లో గుర్తించి, పునఃపరిశీలన చేశారు. ప్రస్తుతం తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు. వారికి మార్గనిర్దేశం చేసేందుకు 12 వేల మంది సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ప్రవాసాంధ్రులను గుర్తించారు. ఈ నెల 15వ తేదీ నాటికి మార్గదర్శకుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. గడువు సమీపిస్తుండటంతో ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడితో జిల్లా యంత్రాంగం తరచూ సమీక్షలు నిర్వహిస్తోంది. అయితే మేము ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నాం అని కొందరు, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్‌) నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మరికొందరు, మాకు తెలిసిన పేదలకు చేతనైనంత సహాయం చేస్తున్నామని ఇంకొందరు సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ పథకం ఉద్దేశం

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను సమాజంలో స్థిరపడిన వారు దత్తత తీసుకుని విద్యా, ఆర్థిక, వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడటమే ఈ పథకం ఉద్దేశం. దత్తత అంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, ఏ రూపంలోనైనా సహాయం అందించవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆయా రంగాల్లోని నిష్ణాతులు తమ పరిజ్ఞానాన్ని పంచడం, శిక్షణ ఇవ్వడం వంటివి చేయవచ్చు. పీ–4 పథకంలో చేరడం వల్ల ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కూడా వివరిస్తున్నారు. కాగా.. మార్గదర్శుల గుర్తింపు ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సహకారం తీసుకుంటున్నారు.ఆగస్టు 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, పెద్ద పరిశ్రమలు, ఆసుపత్రులు, ఉన్నత ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.

జిల్లాలో 73,452 బంగారు కుటుంబాల గుర్తింపు మార్గదర్శుల కోసం అధికారులు ముప్పుతిప్పలు

అధికారులపై తీవ్ర ఒత్తిడి

ఈ పథకంలో మార్గదర్శులను ఎంపిక చేసే ప్రక్రియలో మండల, జిల్లా స్థాయి అధికారులపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కలెక్టర్‌ తరచూ సమావేశాలు నిర్వహిస్తూ.. ఈ నెల 15వ తేదీలోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. దీనికితోడు ప్రతి గెజిటెడ్‌ అధికారి ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని సూచించడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అధికారిక విధులు చూసుకోవాలో, ప్రభుత్వ లక్ష్యాల కోసం దాతల కోసం తిరగాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. చాలామంది అధికారులు ఈ బాధ్యతను కింది స్థాయి సిబ్బందికి అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. దాతలను వెతకలేక కొందరు, పైఅధికారులతో చెప్పలేక మరికొందరు మానసిక వేదనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement