
ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలవండి
జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు అన్ని రకాల అవకాశాలు కల్పించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన జిల్లా విజిలెన్స్–మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అందించిన వివరాల ప్రకారం ప్రస్తుతం 147 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు దర్యాప్తు దశలో ఉండగా, 695 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, బాధితులకు నిర్ణీత కాలంలో నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. డివిజన్, మండల స్థాయిల్లో సివిల్ రైట్స్ డేలను నిర్వహించాలని తెలిపారు.
పారిశుధ్య కార్మికులకు తోడ్పాటు
జిల్లాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ సూచించారు. శనివారం జరిగిన సఫాయి కర్మచారీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం రుణ సదుపాయం కల్పించాలని, గృహ నిర్మాణ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పని ప్రాంతాల్లో వారికి ప్రత్యేక వసతులు కల్పించాలని చెప్పారు. స్టీల్ ప్లాంట్, రైల్వే పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 28వ వార్డులోని కార్మికులకు జీతాలు చెల్లించలేదని కమిటీ సభ్యుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి, వివిధ విభాగాల అధికారులు, కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, రాంబాబు, ఆంజనేయ, మాలతి తదితరులు పాల్గొన్నారు.