
క్రమశిక్షణ, అంకితభావంతోనే వృత్తిలో రాణింపు
జస్టిస్ చీమలపాటి రవి
సబ్బవరం: క్రమశిక్షణ, వృత్తిపై అంకితభావంతో పనిచేస్తేనే న్యాయవాద వృత్తిలో రాణించి.. ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి అన్నారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఐదేళ్లు, మూడేళ్ల లా కోర్సుల్లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులంతా గురువును దైవంగా భావిస్తూ, వినయం, క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ తమ విద్యను కొనసాగించాలని సూచించారు. మంచి పౌరుడిగా ఉన్నప్పుడే మంచి న్యాయవాదిగా ఎదగగలరని అన్నారు. న్యాయవాద వృత్తిలో మొదటి తరం లాయర్లు, మూడు నుంచి నాలుగు తరాలుగా ఉన్నవారు కూడా ఉన్నారని, ఇరువురు ఒకే రకంగా శ్రమించినప్పుడే వృత్తిలో రాణించగలరని చెప్పారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాశరావు మాట్లాడుతూ సమాజంపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే చట్టంపై కూడా అవగాహన ఉంటుందని తెలిపారు. చట్టంలో వచ్చే మార్పులను నిరంతరం అధ్యయనం చేస్తే వృత్తిలో రాణించవచ్చని పేర్కొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి విశ్వవిద్యాలయంలోని సౌకర్యాలు, ఆహార నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తరగతులు జరుగుతున్న తీరును పరిశీలించి, వసతి గృహాలను సందర్శించారు. అక్కడ కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు నరసింగరావు, రామజోగేశ్వరరావు, వర్సిటీ అధ్యాపకులు పాల్గొన్నారు.