
మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి
నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి
అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మైనారిటీ(క్రిస్టియన్లు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు)ల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో వివిధ మైనారిటీ వర్గాల నాయకులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నివసించే మైనారిటీల సమస్యలు తెలుసుకోవడం, వాటిపై చర్చించి తగిన పరిష్కారాలు కనుగొనడమే ఈ సమావేశ ప్రధాన ఉద్దేశమన్నారు. సమావేశంలో 60 మంది మైనారిటీ నాయకులతో సీపీ స్వయంగా చర్చించి వారి సమస్యలను తెలుసుకున్నారు. మైనారిటీల మధ్య ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సీపీ ప్రతిపాదించారు. దీంతో ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. అదే విధంగా ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి, మైనారిటీలు, పోలీసులు అందులో సభ్యులుగా ఉంటూ సమస్యలను పరస్పర సహకారంతో సామరస్యంగా పరిష్కరించుకోవాలని సీపీ సూచించారు. సమావేశంలో డీసీపీలు అజితా వేజెండ్ల, డి.మేరి ప్రశాంతి, మైనారిటీల నాయకులు పాల్గొన్నారు.