
పీ–4 కార్యక్రమాన్ని నిర్బంధం చేయొద్దు
బీచ్‌రోడ్డు: పీ4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయకూడదని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి టి.ఆర్.అంబేద్కర్, ఏపీటీఎఫ్ 257 జిల్లా కార్యదర్శి టి.రామకృష్ణారావు, ఏపీటీఎఫ్ 1938 జిల్లా కార్యదర్శి ఆర్.వి.వీరభద్రరావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఎంఈవో–1 పోస్టులను కామన్ సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతుల ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలని కోరారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించాలన్నారు. హైస్కూల్ ప్లస్‌ల్లో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, యథాతథంగా కొనసాగించాలని కోరారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టి కలెక్టర్ పూల్ ద్వారా పోస్టింగులు ఇవ్వాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న 3 డీఏలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. మెమో నెంబర్ 57 సమాంతర మధ్యమం అమలు చేయాలన్నారు. కొత్తగా అప్‌గ్రేడ్ చేయబడిన పోస్టులను ఎంచుకున్న ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు, ఏపీటీఎఫ్ 257 జిల్లా అధ్యక్షుడు సిహెచ్ కరుణాకర్, ఏపీటీఎఫ్ 1938 అధ్యక్షుడు టి.ధనుంజయ్ రావు తదితరులు పాల్గొన్నారు.
నినాదాలు చేస్తున్న టీచర్లు
ఉపాధ్యాయ సంఘాల డిమాండ్