
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను తిరస్కరించండి
కార్మిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపు
డాబాగార్డెన్స్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఇళ్లకు బిగిస్తున్న అదానీ విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని జిల్లా కార్మిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. మంగళవారం జగదాంబ జంక్షన్ సమీపంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సి.ఎస్.జె. అచ్యుతరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సమావేశంలో పాల్గొన్న సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.కె. రెహమాన్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు మాట్లాడారు. అదానీ లాభాల కోసం మోదీ ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగింపునకు పూనుకుంటోందని విమర్శించారు. ఇది విద్యుత్‌ను సంపూర్ణంగా ప్రైవేటీకరించే కుట్రలో భాగమని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు బిగించిన దుకాణాలు, వ్యాపారులకు ఇప్పటికే పెద్ద ఎత్తున చార్జీలు పెరిగి బిల్లులు వస్తున్నాయని, వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రజల ఇళ్లకు ఈ మీటర్లు బిగించడానికి ప్రభుత్వం సిద్ధపడిందని, ఈ మీటర్ల వల్ల నష్టం లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ద్వారా మోసపూరిత ప్రకటనలు చేయిస్తోందని విమర్శించారు. సింగిల్ ఫేజ్ మీటరుకు రూ.8,927, త్రీఫేజ్ మీటరుకు రూ.17,266 వసూలు చేయాలని ప్రభుత్వ నిర్ణయమని, ఈ మొత్తం ఒకేసారి కాకుండా.. ప్రతి నెలా బిల్లులో 93 నెలల పాటు వసూలు చేయాలని నిర్ణయించారని తెలిపారు. అదానీ మీటర్ల వల్ల ప్రజలపై రూ.25 వేల కోట్ల అదనపు భారం పడుతుందని, పీక్‌టైమ్ పేరుతో రాత్రులు, సెలవు రోజులు, వేసవికాలాల్లో మరింత పెద్ద ఎత్తున చార్జీలు వేస్తారని హెచ్చరించారు. ప్రస్తుతం కరెంటు ఉపయోగించి, బిల్లు వచ్చిన 15 రోజుల్లోపు కట్టే అవకాశం ఉండగా.. అదానీ స్మార్ట్ మీటర్లకు ముందుగానే డబ్బు చెల్లించి రీఛార్జ్ చేసుకోవాలని, రీఛార్జ్ కాకపోతే చీకట్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు.
హామీల అమలుకు డిమాండ్
కూటమిని గెలిపిస్తే స్మార్ట్ మీటర్లు, ట్రూ–అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు రద్దు చేస్తామని హామీనిచ్చారని, ఇచ్చిన హామీ మేరకు వీటిని రద్దు చేయాలని ఐక్యవేదిక డిమాండ్ చేసింది. హామీల సాధనకు ఈ నెల 23 నుంచి 26 వరకు జోన్లు, మండలాలు వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 29న జిల్లా సదస్సు, 30 నుంచి ఆగస్టు 1 వరకు కాలనీల వారీగా సమావేశాలు, ప్రదర్శనలు, 2న జిల్లాలోని అన్ని విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసనలు, 5న ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. ఈ సమావేశంలో కె.వనజాక్షి, ఎం.ఎ.బేగం, ఆర్.విమల, బి.మమత, కె.దేవసహాయం, టి.శ్రీరామమూర్తి, ఎన్.ప్రకాష్ రావు, వై.రాంబాబు, ఎల్.జె.నాయుడు, వై.రాజు, కె.ఎం.కుమార మంగళం, ఎం.సుబ్బారావు, కె.వెంకట్రావు, సుశీల, డి.శైలజ తదితరులు పాల్గొన్నారు.