
లక్ష్మీనరసమ్మ పార్థివదేహం అప్పగింత
డాబాగార్డెన్స్: ఏపీఎస్‌ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(సిటు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెజెల్ల తులసీరాం తల్లి లక్ష్మీనరసమ్మ(103) దేహాన్ని ఆంధ్రా మెడికల్ కళాశాల విద్యార్థుల పరిశోధన కోసం మంగళవారం అప్పగించారు. పాత డెయిరీఫాం సమీపంలోని తులసీరాం స్వగృహంలో మంగళవారం ఆమె కన్నుమూశారు. లక్ష్మీనరసమ్మ భౌతికకాయాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్, సీపీఎం నాయకులు పి.మణి, వి.కృష్ణారావు, నరేంద్రకుమార్, పి.వెంకట్రావు, డి.అప్పలరాజుతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, పెన్షనర్స్ సందర్శించి నివాళులర్పించారు. లక్ష్మీనరసమ్మ తాను మరణించిన తర్వాత కళ్లు, దేహాన్ని దానం చేయాలని జీవించి ఉన్నప్పుడే పిల్లలకు సూచించారు. ఆమె కోరిక మేరకు జ్యోతిబసు దేహదాన ప్రోత్సాహక సంస్థ ద్వారా కళ్లు, దేహాన్ని ఆమె కుమారుడు తులసీరాం ఏఎంసీకి అప్పగించారు. తులసీరాం నిర్ణయం సమాజానికి స్ఫూరిదాయకమని జగ్గునాయుడు, ఆర్‌కేఎస్‌వీ కుమార్ అన్నారు.