
ఏయూలో బీటెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సు
● ఈఏపీ సెట్ ద్వారా అడ్మిషన్లు ● తొలి ఏడాది 30 మందికి ప్రవేశాలు ● పలు అంశాలకు ఏయూ అకడమిక్ సెనేట్ ఆమోదం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్స్‌కు సెనేట్ ఆమోదం తెలిపింది. సోమవారం నిర్వహించిన అకడమిక్ సెనేట్ సమావేశంలో సభ్యులు ఈ మేరకు తీర్మానించారు. ఈ కోర్సులో ప్రవేశాలను ఈఏపీ సెట్ ద్వారా నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ కళాశాలలోని ఈసీఈ విభాగం నిర్వహించే ఈ కోర్సులో తొలి బ్యాచ్‌లో 30 మందికి ప్రవేశాలను కల్పించనున్నారు. ఈ మేరకు సెనేట్ పలు తీర్మానాలకు ఆమోదం తెలిపింది.
● మెటీరియాలజీ ఓషనోగ్రఫీ విభాగం నుంచి గతంలో నిలిపివేసిన ఎంటెక్ అట్మాస్ఫియరిక్ సైన్స్, ఓషియానిక్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి పునఃప్రారంభించాలని నిర్ణయించింది.
● ఇంజనీరింగ్ కళాశాలలో పలు విభాగాల్లో డ్యూయల్ డిగ్రీ చేయడానికి ఆమోదం తెలిపింది.
● ఏయూ దూర విద్య కేంద్రం నుంచి అన్ని పీజీ కోర్సులకు వార్షిక పరీక్షల స్థానంలో సెమిస్టర్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
● సైన్స్ కళాశాల పరిధిలో పలు విభాగాల్లో ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది.
● మైరెన్ లివింగ్ రిసోర్స్ విభాగం నుంచి ఆక్వా కల్చర్‌లో ఏడాది కాలవ్యవధితో పీజీ డిప్లమో కోర్సుకు ఆమోద ముద్ర వేసింది.
సమావేశంలో మాజీ ఉపకులపతులు మాట్లాడుతూ ఏయూ చిత్రకళా విభాగం, థియేటర్ ఆర్ట్స్ విభాగాలను సమన్వయం చేస్తూ స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏర్పాటును ప్రతిపాదించారు. సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌ను బలోపేతం చేయాలని సూచించారు. త్వరలోనే సమగ్ర ప్రతిపాదనలతో ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు వీసీ రాజశేఖర్ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయ విధివిధానాలను వివరించారు. సమావేశంలో ఏయూ రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనంజయరావు, మాజీ వీసీలు ఆచార్య ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, ఆచార్య బీలా సత్యనారాయణ, ఆచార్య జీఎస్‌ఎన్ రాజు, ఆచార్య జి.నాగేశ్వరరావు, ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు, కళాశాల ప్రిన్సిపాళ్లు, ఫ్యాకల్టీ చైర్మన్లు, అకడమిక్ సెనేట్ సభ్యులు పాల్గొన్నారు.