
వర్త సంఘం నాయకులు, వర్తకులు, దేవస్థానం అధికారులతో మాట్లాడుతున్న ముత్తంశెట్టి
● సింహగిరిపై షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ ప్లాన్‌కు వర్తకుల ఆమోదం ● ఎమ్మెల్యే ముత్తంశెట్టి ఆధ్వర్యంలో సమస్యకు పరిష్కారం
సింహాచలం: గత రెండు నెలలుగా నెలకొన్న సింహగిరి వర్తకుల షాపింగ్ కాంప్లెక్స్ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన ప్రసాద్ స్కీమ్ నిధులతో సింహగిరిపై ప్రస్తుతం ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌ను తొలగించి దాని స్థానంలో ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక చేసిన విషయం తెలిసిందే. అయితే వర్తకులకు దేవస్థానంకి మధ్య ఇప్పటి వరకు ప్రణాళిక విషయంలో సరైన ఒప్పందం కుదరకపోవడంతో దఫదఫాలుగా చర్చలు జరిగాయి. నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ ప్రణాళికలో పలుమార్లు మార్పులు చోటుచేసుకుంటూ వచ్చాయి. సమస్యను ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు దృష్టికి కూడా వరక్తులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి వర్తకులకు అనుగుణంగా ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి ప్రణాళికను మార్పు చేశారు. ఆ ప్రణాళికను మంగళవారం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో నగరంలోని ఆయన స్వగృహంలో దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు, వర్తకుల సమక్షంలో పెట్టారు. వర్తకులు కోరిన విధంగా మెట్లను మార్చామని దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు ఎమ్మెల్యేకి వివరించారు. దేవస్థానం అధికారులు రూపొందించిన ప్రణాళికకు వర్తకులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ డిసెంబర్ 10 కల్లా విడతల వారీగా దుకాణాలను ఖాళీ చేసి అధికారులకు సహకరించాలని వర్తకులకు సూచించారు. వర్తకులు ఆమోదించిన ప్లాన్‌ను వెంటనే లిఖితపూర్వకుగా వారికి అందజేయాలని అధికారులకు సూచించారు. ఏఈవో పాలూరి నరసింగరావు, సింహగిరి వర్తక సంఘం అధ్యక్షుడు ముగ్గు కిరణ్, ఉపాధ్యక్షుడు సానబోయిన రాజు, కోశాధికారి దొంతల శంకర్, వర్తకులు వరదా నరసింహమూర్తి, కస్తూరి సత్యనారాయణ, వార్డు వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి ఎర్ర వరంబాబు ఉన్నారు.