
విమ్స్ పేరు వినగానే రోగులకు కార్పొరేట్ వైద్య సేవలు గుర్తుకొస్తాయి. ప్రశాంత వాతావరణం, కార్పొరేట్ స్థాయి పడకలు, ఐసీయూ గదులు, వసతులు, అత్యాధునిక వైద్య పరికరాలు ఇక్కడి రోగుల సేవలకు అందుబాటులో ఉన్నాయి. అన్ని విభాగాల వైద్య నిపుణులు సేవలు అందిస్తున్నారు. అతి తక్కువ ధరలకు సీటీ స్కానింగ్, ఎక్స్‌రే, రక్త రీక్షలు చేస్తున్నారు. వీటితో పాటు ఉచిత ఫిజియోథెరపీ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఆరిలోవ: విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో కార్పొరేట్ స్థాయి ఆధునిక పరికరాలతో ఉచిత ఫిజియోథెరపీ సేవలను రోగులకు అందిస్తున్నారు. ఇటీవల స్పైనల్ అండ్ న్యూరో రీహేబిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వైద్యాధికారులు ఇందులో ఉన్న ఆధునిక పరికరాలను ఉపయోగించి అవసరమైనవారికి ఫిజియోథెరపీ సేవల్ని ఉచితంగా అందిస్తున్నారు. వీటితో పాటు ఇక్కడ స్పీచ్ థెరపీ, ఆడియో థెరపీ అందుబాటులో ఉంది. కోమా, పక్షవాతంతో బాధపడిన అనంతరం పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ప్రత్యేక సేవలు అందిస్తున్నారు.
పక్షవాత రోగులకు ప్రత్యేక ఐసీయూ
పక్షవాతంతో బాధపడుతున్నవారికి ప్రత్యేక ఐసీయూ ఏర్పాటు చేశారు. ఇందులో ఆధునిక పడకలు అమర్చి ఇన్‌పేషెంట్ సేవలు అందిస్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ సేవల్ని పొందాలంటే నెలకు కనీసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. విమ్స్‌లో మాత్రం ఈ సేవలు పూర్తిగా ఉచితమేనని వైద్యులు చెప్తున్నారు. వీటితో పాటు లేజర్ థెరపీ, కంటిన్యూయస్ పాసివ్ మోషన్(సీపీఎం) థెరపీ, ఎక్సర్‌సైజ్ థెరపీ, ఎలక్ట్రో థెరపీ, సస్పెన్షన్ థెరపీ, మొబిలిటీ థెరపీ, ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్‌ఆర్), ఆల్ట్రాసౌండ్, మజల్ స్టిమ్యులర్స్, ఇంటర్ ఫెరెన్షియల్ థెరపీ(ఐఎఫ్‌టీ), రోబోటిక్ గ్లౌజ్, టెన్స్, షార్ట్‌వేవ్ థెరపీ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి.
అందుబాటులో ఉన్న యంత్రాలు
కార్పొరేట్ ఆస్పత్రులకు మించి, విమ్స్‌లో అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. ట్రాక్షన్ మిషన్, సీపీ వాకర్, ఫింగర్ లేడర్, ఆల్ట్రా సౌండ్, ట్రెడ్ మిల్, స్పైన్ డీ ట్రాక్, మొబిలిటీ ట్రైనర్, స్టిమ్యులేటర్, ర్యాంప్ వాకర్, పేర్లాక్ బార్, స్టాటిక్ సైకిల్స్, షోల్డర్ వీల్, స్వెల్ బాల్, పెగ్ బోర్డు, బ్యాలన్స్ బోర్డు, డంబెల్స్, వోబుల్ బోర్డు, థ్రెడ్ బ్యాండ్ తదితర యంత్రాలు వినియోగిస్తున్నారు. వీటిని విజయవాడ, హైదరాబాద్, ముంబయ్ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి, ఇక్కడ ఏర్పాటు చేశారు.
దీర్ఘకాలిక రోగులకు వరం
ఈ కేంద్రంలో ఆరుగురు ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు మరికొందరు సహాయక సిబ్బంది ఉన్నారు. దీర్ఘకాలంగా ఎముకల వ్యాధులతో బాధపడుతున్నవారు, కీళ్ల నొప్పులు, మెడ నొప్పులు, వెన్నుపూస నొప్పులు, ఆర్థ్రరైటిస్ సమస్యలు, టెండాన్ సమస్య తదితర వాటితో బాధపడుతున్నవారికి అందుబాటులో ఉన్న ఆధునిక యంత్రాలను ఉపయోగించి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు ప్రమాదాలకు గురై, ఆపరేషన్ తర్వాత కాళ్లు, చేతులు కోల్పోయినవారికి రీహేబిలిటేషన్ కింద కృత్రిమ అవయవాలు అందిస్తున్నారు. పక్షవాత రోగులకు ప్రత్యేక థెరపీ ఇస్తున్నారు.
ఉచిత సేవలను వినియోగించుకోండి
విమ్స్‌లో ఈ మధ్యనే స్పైనల్ అండ్ న్యూరో రీహేబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, ఉచిత సేవలు అందిస్తున్నాం. ఆధునిక పరికరాలు అందుబాటులో ఉంచాం. ఇక్కడ ఉచితంగా అందించే థెరపీని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పొందాలంటే రూ.లక్షలు వెచ్చించాలి. పక్షవాతంతో నడవలేని స్థితిలో ఉన్నవారి కోసం ప్రత్యేక ఐసీయూ సేవలు ఉచితంగా అందిస్తున్నాం. చెవిటి, మూగ బాధితులకు స్పీచ్, ఆడియో థెరపీ, కాక్లియర్ ఇంప్లాంటేషన్ జరిగినవారికి ప్రత్యేక స్పీచ్ థెరపీ అందిస్తున్నాం. ఆరుగురు ఫిజియోథెరపీ వైద్యులతోపాటు సహాయక సిబ్బందితో సేవలు అందిస్తున్నాం.
– డాక్టర్ కె.రాంబాబు, డైరెక్టర్, విమ్స్

విమ్స్‌లో రీహేబిలిటేషన్ సెంటర్