వసూళ్లు నిల్‌.. నష్టాలు ఫుల్‌ | - | Sakshi
Sakshi News home page

వసూళ్లు నిల్‌.. నష్టాలు ఫుల్‌

Nov 29 2026 11:41 AM | Updated on Nov 29 2026 11:41 AM

రూ.250 కోట్లకుపైగా బకాయిలు

ఉమ్మడి జిల్లాలో సహకార సంఘాలు :

51

ఏటా జరుగుతున్న బిజినెస్‌:

రూ.3,100 కోట్లు

నష్టాల్లో కూరుకుపోయిన పీఏసీఎస్‌లు: 25

భారీగా పేరుకుపోయిన బకాయిలు

పీఏసీఎస్‌లలో రుణాలు తీసుకున్న రైతులు

తిరిగి చెల్లించేందుకు నిరాకరణ

లీగల్‌ నోటీసులు జారీ చేసినా అంతే..

ఆస్తులు వేలం వేస్తామన్నా స్పందన కరువు

నష్టాల్లో కూరుకుపోయిన పలు సంఘాలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: యాచారం పీఏసీఎస్‌లో 983 మంది రైతులు ఐదేళ్ల క్రితం తమ ఆస్తులను తాకట్టుపెట్టి పౌల్ట్రీఫాం, డెయిరీ ఫాం, గొర్రెలు, మేకల పెంపకం కోసం సుమారు రూ.40 కోట్ల దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. సాధారణంగా తీసుకున్న అప్పును ప్రతి ఆరు నెలలు/ ఏడాదిలోపు వడ్డీ చెల్లించి, రుణాలను రీ షెడ్యూల్డ్‌ చేసుకోవాలి. కానీ వీరిలో 900 మందికిపైగా రైతులు ఇప్పటికీ పైసా కట్టలేదు. లీగల్‌ నోటీసులు జారీ చేసినా.. ఆస్తులు వేలం వేస్తామని హెచ్చరించినా స్పందన లేదు. ఫలితంగా రూ.30 కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కొత్తగా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అప్పులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇలా ఒక్క యాచారం పీఏసీఎస్‌ మాత్రమే కాదు ఉమ్మడి జిల్లాలోని మంచాల, పొల్కంపల్లి, మహేశ్వరం, హయత్‌నగర్‌, పాల్మాకుల, పటేల్‌గూడ, మామిడిపల్లి, సురంగల్‌, హైదర్ష్‌కోట్‌, నార్సింగి, చిన్నగోల్కొండ, మల్కారం, మోకిల, గుండాల, ఆలూరు, చేవెళ్ల, తట్టెపల్లి, హరిదాస్‌పల్లి, గండేడ్‌, బాటసింగారం, ఆకులమైలారం, దండుమైలారం ప్రాథమిక వ్యవసాయ సహకర పరపతి సంఘాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

కారణాలెన్నో.. మచ్చుకు కొన్ని..

సొసైటీలు ఇచ్చిన దీర్ఘకాలిక రుణాల్లో భాగంగా ఆవులు, గేదెలు, గొర్రెలకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియాన్ని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. కానీ ఆయా పశువులకు బీమా పాలసీ చేయడం లేదు. ఏదైనా పశువు చనిపోతే ఆ నష్టాన్ని రైతులే భరించాల్సి వస్తోంది. ఆదాయాన్ని సమకూర్చి పెడుతుందని భావించిన పశువు చనిపోవడంతో రైతులు కూడా చివరికి చేతులెత్తేయాల్సి వస్తోంది.

తీసుకున్న పంట రుణాలు సహా వడ్డీని సకాలంలో చెల్లించే వారికి కేంద్రం ఇచ్చే రిబిట్‌ను రైతు ఖాతాలో జమ చేయాలి. (రూ.లక్ష రుణానికి ఏడాదికి వడ్డీ రూ.ఏడు వేలు అయితే రీబిట్‌ కింద రూ.3,500 ఆయా బ్యాంకులకు చెల్లిస్తుంది). కానీ జిల్లాలో కొన్ని లక్షలు బ్యాంకు ఖాతాల్లోనే మగ్గుతున్నాయి. రుణాలు చెల్లించి, ఖాతాలు క్లోజ్‌ చేసుకున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చిన రిబిట్‌ ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందనేది కూడా అంతు చిక్కని ప్రశ్నగా మారింది.

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం పాలకవర్గం డైరెక్టర్లు, చైర్మన్లకు అదే బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేయకూడదు. కానీ డీసీసీబీ ఓ డైరెక్టర్‌కు కందుకూరు బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణం మంజూరు చేసింది. రుణగ్రహీత పాలకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తుండటంతో బకాయిల వసూళ్ల విషయంలో బ్యాంకు సిబ్బంది చేతులెత్తేయాల్సి వచ్చింది. ఆడిటర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆర్బీఐ రుణాల మంజూరును నిలిపివేయడంతో పాటు రూ.20 లక్షల జరిమానా విధించింది.

రూ.1.40 కోట్ల నాబార్డు రుణంతో అవసరం లేకపోయినా కందుకూరు వద్ద గోదాములు, పీఏసీఎస్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌ భవనాలు కట్టారు. వీటికి కనీసం టెండర్‌ కూడా పిలవలేదు. నామినేషన్‌ పద్ధతిలో సొంతవాళ్లకు ఈ పనులు అప్పగించి, పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

యాచారం, మంచాల మండలాల పరిధిలో ప్రభుత్వం ఏళ్ల క్రితమే పలువురు పేదలకు కొంత భూమిని అసైన్డ్‌ చేసింది. ఆ మేరకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసింది. ఆయా రైతులు వాటిని బ్యాంకులో తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు. తీరా వారికి పొజిషన్‌ ఇవ్వకపోవడంతో ఆయా రైతులంతా తీసుకున్న రుణాలు ఎగ్గొట్టారు.

సొసైటీలకు పాలకవర్గాలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవాల్సి ఉంది. ఇటీవల వీటిపై ప్రభుత్వ జోక్యం పెరిగింది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తన కార్యకర్తలను నామినేటెడ్‌ ప్రాతిపదికన నియామకాలు చేపడుతోంది. రైతు సంఘాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం కూడా సొసైటీల నష్టాలకు మరో కారణమైంది.

ఉమ్మడి జిల్లాలో 51 సంఘాలు ఉండగా, రెండు లక్షలకుపైగా సభ్యులు ఉన్నాట్లు అంచనా. రైతులు తమ వ్యవసాయ పొలాలను బ్యాంకులో తాకట్టు పెట్టి స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు పొందుతుంటారు. ఇలా మొత్తం పీఏసీఎస్‌ల పరిధిలో ఏటా రూ.3,100 కోట్ల బిజినెస్‌ జరుగుతున్నట్లు అంచనా. పాలకవర్గాల ఎంపికలో పెరిగిన రాజకీయ జోక్యం, డైరెక్టర్లు, చైర్మన్ల బంధుప్రీతి, అధికారుల ఉదాసీనత వెరసి ఆయా సంఘాల నష్టాలకు కారణమవుతున్నాయి. 28 సంఘాలు మాత్రమే కొంత మెరుగ్గా కన్పిస్తుండగా, మిగతావి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి. మెజార్టీ రైతులు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. ఫలితంగా రూ.250 కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement