కేశంపేట: ఆరోగ్యకరమైన జీవితానికి శాఖాహారం, ధ్యానం రెండు కళ్లలాంటివని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యాన, శాఖాహార ప్రచార నిర్వాహకుడు బంగ్లా ఆంజనేయరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని ఇప్పలపల్లి, వేములనర్వ గ్రామాల్లో శాఖాహారంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ.. ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులతో కూడిన సమతుల్య శాఖాహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని చెప్పారు. జీవహింసకు దూరంగా ఉంటూ గాంధీజీ, బుద్ధుడు, పత్రీజీ చూపిన అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. శాఖాహారం, ధ్యానాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ధ్యాన పిరమిడ్ జిల్లా అధ్యక్షులు శంకర్, కవిత, శివకుమార్, పద్మ, శైలజ, జ్ఞానేశ్వరి, ప్రవీణ్, సంధ్య, నీలమ్మ, రాములు, దీప్తి, నారాయణ, లాలు, బాబు, యాదయ్య, రాఘవేందర్, బాల మ్మ, శ్రీనివాస్, రేణుక తదితరులు పాల్గొన్నారు.


