యాలాల: మండలంలో విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఎంఈఓ శాంతప్పకు సూచించారు. మండల విద్యాధికారిగా బాధ్యతలు తీసుకున్న శాంతప్ప గురువారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. కాగా ఇటీవల జపాన్ టీచర్ ఎక్స్‌పోజర్ విజిట్‌కు వెళ్లిన కోకట్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. జపాన్ విద్యావిధానంలో అవలంబిస్తున్న పద్ధతులను కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు వివరించారు.
వినాయకుడిని
దర్శించుకున్న ఎస్పీ
అనంతగిరి: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలో ఆయా వాడల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలను బుధవారం రాత్రి ఎస్పీ స్నేహమెహ్ర సందర్శించి స్వామివారికి పూజలు చేసి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు ఎస్పీని ఘనంగా సన్మానించారు.
నిమజ్జనానికి పటిష్ట భద్రత
డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
తాండూరు: గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి పటిష్ట చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. తాండూరు సబ్ డివిజన్ పరిధిలో 920 విగ్రహాలు, పట్టణ పరిధిలో 350 విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు చెప్పారు. వీటిని శుక్రవారం నిమజ్జనం చేస్తారని తెలిపారు. ఇందుకు కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎస్పీ స్నేహ మెహ్ర నేతృత్వంలో ఐదు మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 25 మంది ఎస్‌ఐలు, 350 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. టీజీఎస్‌పీ పోలీసు బలగాలు రెండు కంపెనీలు వస్తున్నట్లు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా నిఘా పెడతామని తెలిపారు. కోకట్ కాగ్నానది వద్ద, మల్‌రెడ్డి పల్లి చెరువు వద్ద నిమజ్జనం కోసం ఐదు క్రేన్లు, మండపాల వద్దమరో మూడు క్రేన్‌లలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. టౌన్‌లో మూడు పికెట్లు, ఐదు బ్లూకోట్స్ వాహనాలలో పహారా నిర్వహిస్తారని, సీఐ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేందుకు ఉత్సవ కమిటీలు సహకరించాలని అన్నారు.
తల్లీకూతుళ్ల అదృశ్యం
పహాడీషరీఫ్: ఇద్దరు కూతుళ్లతో కలిసి గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసకుంది. ఎస్‌ఐ ఎల్.వెంకటేశ్వర్లు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. రంగనాయకుల కాలనీకి చెందిన సల్లంగుల నాగరాజు, లక్ష్మి (31) దంపతులు. వారికి ముగ్గురు సంతానం. రోజు మాదిరిగానే ఈ నెల 16న ఉదయం 7 గంటలకు నాగరాజు విధుల నిమిత్తం వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా కుమారుడు శివ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. భార్య, కూతుళ్లు లావణ్య (13), లహరి (9) విషయమై కుమారుడిని ఆరా తీయగా కడుపు నొప్పి కారణంగా వారు స్కూల్‌కు రాకపోవడంతో తానొక్కడినే వెళ్లి వచ్చానని చెప్పాడు. వారి ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గానీ, 87126 62367 నంబర్‌లోగానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.


