కొడంగల్: నియోజకవర్గలోని కొడంగల్, దుద్యాల, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో రైతులు వాణిజ్య పంటలపై ఆసక్తి చూపుతున్నారు. కంది, పత్తి, మినుము, పెసర, జొన్న చేలల్లో ఇతర పంటలను అంతర పంటలుగా వేస్తున్నారు. అధిక వర్షాలు కురిసి ఒక ఏడాది, వర్షాలు కురవక మరో ఏడాది పంటలకు నష్టం జరుగుతోంది. సాగు ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు కూరగాయల సాగు, పూలతోటల పెంపకం, వాణిజ్య పంటలపై దృష్టి సారించారు. వాణిజ్య పంటల వల్ల అధిక లాభాలతో పాటు ఖర్చు కూడా తక్కువగా ఉంటోంది. ఎక్కువ కష్ట పడకుండా అధిక దిగుబడి వచ్చే విధంగా రైతులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో వేరుశనగ పంటను సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు. అధిక దిగుబడితో పాటు లాభాలు కూడా వస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగను అంతర పంటగా కూడా వేస్తున్నారు. మామిడి తోటలో పల్లీ పంటను సాగు చేస్తున్నారు. పెసర, మినుము, ఇతర పంటల్లో పల్లీలను సాళ్ల మధ్యన వేసి పండిస్తున్నారు. మార్కెట్‌లో పల్లీలకు మంచి డిమాండ్ ఉండడంతో వేరుశనగ పంటను రైతులు సాగు చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు మూడు వేల ఎకరాలకు పైగా వేరుశనగ పంట సాగులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.


