విద్యుత్‌ కోతలపై రోడ్డెక్కిన రైతన్న | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కోతలపై రోడ్డెక్కిన రైతన్న

Sep 18 2026 8:18 AM | Updated on Sep 18 2026 8:18 AM

మోత్కూర్‌ గేట్‌ వద్ద ధర్నా

బోర్లు నడవక పంటలు

ఎండుతున్నాయని ఆవేదన

దోమ: వ్యవసాయానికి సక్రమంగా త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు గురువారం రోడ్డెక్కారు. మండలంలోని మోత్కూర్‌ గేట్‌ సమీపంలో పరిగి – మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో భారీగా వాహనాలు స్తంభించగా, కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పగటిపూట వ్యవసాయానికి కేటాయిస్తున్న త్రీఫేస్‌ విద్యుత్‌లోనూ తరచూ కోతలు విధిస్తుండటంతో బోర్లు నడవక పంటలకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సాగు చేసిన పంటలు ఎండుముఖం పట్టాయని, విద్యుత్‌ సరఫరా ఇలాగే కొనసాగితే పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సాగునీటికి కరెంటే ఆధారం

మండలంలో అధికంగా బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు విద్యుత్‌ సరఫరా కీలకంగా మారింది. ఓ పక్క ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బంది పడుతున్న రైతులకు.. మరోపక్క విద్యుత్‌ కోతలు తలనొప్పిగా మారుతున్నాయి. పగటిపూట త్రీఫేస్‌ కరెంటు సక్రమంగా అందుతుందని ఆశించి పొలాలకు వెళ్లే సమయంలో సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. కరెంటు వచ్చే సమయంపై స్పష్టత లేకపోవడంతో బోర్లు ఆన్‌ చేయడం, పంటలకు నీరు పెట్టడం ఇబ్బందిగా మారిందన్నారు. ఒక్కసారి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే తిరిగి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని వాపోయారు.

పంటలు ఎండిపోతున్నాయి

విద్యుత్‌ కోతల ప్రభావం నేరుగా పంటలపై పడుతోందని రైతులు వాపోతున్నారు. కీలక దశలో పంటలకు నీరందకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సాగు కోసం వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, కరెంటు సమస్యతో పంట నష్టపోతే అప్పుల భారం మరింత పెరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. విద్యుత్‌ సరఫరాలో అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

అదనపు కోతలతో ఇబ్బందులు

గత ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించిందని, ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన మేర విద్యుత్‌ అందడం లేదని రైతులు ఆరోపించారు. 24 గంటలు ఉండాల్సిన కరెంటు.. కేవలం ఎనిమిది గంటలు కూడా ఉండడం లేదని ఆందోళన చెందుతున్నారు. పగటిపూట ఇస్తున్న త్రీఫేస్‌ సరఫరాలోనూ అదనపు కోతలు విధించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం, విద్యుత్‌ అధికారులు వెంటనే స్పందించి వ్యవసాయానికి నిరంతరాయంగా త్రీఫేస్‌ విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యమే కారణం

విద్యుత్‌ సరఫరా సమస్యపై అధికారులు దృష్టి సారించకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని రైతులు ఆరోపించారు. పంటలు ఎండిపోయిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. రైతుల ధర్నాతో మోత్కూర్‌ గేట్‌ వద్ద కొద్దిసేపు నిరసన వాతావరణం నెలకొంది. ఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్‌ ఏఈ అహ్మద్‌, ఎస్సై వసంత్‌ జాదవ్‌ రైతులను సముదాయించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వ్యవసాయానికి అవసరమైన సమయంలో కరెంటు అందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

తీవ్ర అంతరాయం

విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడంతో బోర్లు నడవక తమ పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. 24 గంటలు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, కేవలం 8 గంటలు కూడా రావడం లేదు. పంట పెట్టుబడులు సైతం రాలేని పరిస్థితి నెలకొంది.

– మడుగు పాండు, రైతు, మోత్కూర్‌

చర్యలు చేపట్టాలి

అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలి. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండుతున్నాయి. మరో పక్క విద్యుత్‌ కోతలు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తాం.

– బంక చెన్నయ్య, రైతు, మోత్కూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement