వికారాబాద్/కుల్కచర్ల: వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. పలు ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో 19 ప్రభుత్వ శాఖలను భాగస్వాములను చేశారు. ఆయా శాఖల వారీగా టార్గెట్లు ఇచ్చారు. అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల పర్యవేక్షణలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంకల్పించారు. వాతావరణ కాలుష్యం రోజుకురోజుకూ పెరిగి పోతున్న తరుణంలో పచ్చదనం పెంచడం అనివార్యంగా మారింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా అటవీ విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 40,53,500 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. గత ఏడాది 40,54,000 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా 80 శాతం పూర్తి చేశారు. ఈ సారి మరింత సమర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలో ఖాళీ స్థలాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు, రోడ్డు పక్కన, బంజరు భూముల్లో, పొలం గట్లపై ఇలా అవకాశమున్న ప్రతిచోటా మొక్కలు నాటాలని నిర్ణయించారు.
అందుబాటులో మొక్కలు
జిల్లా వ్యాప్తంగా అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో 600 పైచిలుకు నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పరిధిలో 15, గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో 594 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయి. వీటిలో 40లక్షల మొక్కలను పెంచుతున్నారు. టేకు మొక్కలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్కో నర్సనీలో 5వేల చొప్పున 594 జీపీల్లో 28,30,000 మొక్కలు, 15 ఫారెస్టు నర్సరీల్లో 10 లక్షల మొక్కలు పెంచుతున్నారు. అటవీ ప్రాంతాల్లో గచ్చకాయ, వెదురు, గుల్‌మోర్, రేన్‌ట్రీ, రావి, మర్రి, కానుగ, తురాయి, గార్డెనింగ్ మొక్కలు, దానిమ్మ, నిమ్మ, గోరింటాకు, తదితర మొక్కలు నాటనున్నారు. ఇళ్ల వద్ద పూలు, పండ్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. వీటితో పాటు పాఠశాలల్లో విద్యార్థులకు, అంగన్‌వాడీ కేంద్రాలకు మొక్కలు పంపిణీ చేయనున్నారు.
శాఖ
అటవీ 3.3లక్షలు
ఆర్‌అండ్‌బీ 5వేలు
పంచాయతీరాజ్ 4లక్షలు
డీఆర్డీఓ, ఎంపీడీఓలు 24.4లక్షలు
నీటిపారుదల 76వేలు
వ్యవసాయ 5.38లక్షలు
మార్కెట్ 5వేలు
ఉద్యాన 2.50లక్షలు
ప్రొహిబిషన్ 9.5లక్షలు
విద్య 11వేలు
తాండూరు మున్సిపల్ 70వేలు
వికారాబాద్ మున్సిపల్ 80వేలు
కొడంగల్ మున్సిపల్ 35వేలు
పరిగి మున్సిపల్ 30వేలు
ఈ నెల 19 నుంచి గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
ప్రజాప్రతినిధుల సమన్వయంతో వనమహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేస్తాం. ప్రతి గ్రామం కచ్చితంగా లక్ష్యాన్ని అధిగమించేలా పర్యవేక్షణ చేస్తున్నాం.
– రామకృష్ణ, ఎంపీడీఓ, కుల్కచర్ల
కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశాం. లక్ష్యాన్ని అధిగమించాలనే అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పొలం గట్లపై మొక్కలు నాటుకోవాలని రైతులకు సూచించాం.
– చంద్రశేఖర్, ఏపీఓ, కుల్కచర్ల, చౌడాపూర్ మండలాలు
ఈ ఏడాది
వనమహోత్సవ లక్ష్యం
19 శాఖలకు బాధ్యతలు
594 జీపీలు, 15 ఫారెస్టు నర్సరీల్లో మొక్కల పెంపకం
గత సంవత్సరం 80శాతం పూర్తి


