నేడు ఎంపీ కొండాకు గుండె సంబంధిత శస్త్ర చికిత్స
తాండూరు: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నేడు (సోమవారం) గుండె సంబంధిత ఆపరేషన్ నిర్వహించనున్నారు. ఆదివారం యాలాల మండలంలో పర్యటన ముగించుకొని తాండూరుకు వస్తున్న సమయంలో అత్యవసరంగా నగరానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతకుముందు హైదరాబాద్ మార్గంలోని ఇందిరమ్మ కాలనీలో కొంత మంది బాధిత కుటుంబాలను కలిసి ఆర్థిక సాయం చేశారు. మిగిలిన వారికి ఆర్థిక సాయం అందించాలని నాయకులకు చెప్పి బయలుదేరారు. అత్యవసరంగా వెళ్లాల్సిన అవసరం ఏమిటని విలేకరులు అడగ్గా తనకు సోమవారం ఉదయం గుండెకు సంబంధించిన సర్జరీ చేస్తారని తెలిపారు. అపోలో హాస్పిటల్స్ ఎండీగా ఎంపీ కొండా సతీమణి సంగీతారెడ్డి కొనసాగుతున్నారు. సోమవారం ఉదయం అపోలో వైద్యులు సర్జరీ చేయనున్నారు. అనంతరం నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిసింది.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు రోడ్డు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే నిధులు మంజూరైనట్లు తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలు అడ్డంకులు సృష్టించాయని ఆరోపించారు. కొందరు గ్రీన్ ట్రిబ్యూనల్‌లో కేసు వేయడంతో పనులు జరగలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో కేసు వాపసు చేసుకున్నారని పేర్కొన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి వాహనదారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి
కొడంగల్ రూరల్: ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టళ్లలో దోభీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి కోరారు. ఆదివారం పట్టణంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి.అశోక్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రులు, హాస్టళ్లలో అధునాతన దోభీ ఘాట్ కోసం ఎకరా భూమిని కేటాయించాలని, బట్టలు ఉతికేందుకు నియమించే కాంట్రాక్టర్‌ను రజకులకే కేటాయించాలని కోరారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, నాయకులు ఎస్.వెంకటయ్య, బాలప్ప, వెంకటయ్య, సుందరప్ప, వెంకటేష్, నాగేష్, శ్రీనివాస్, శ్రీనివాస్, చిన్న మహేష్ తదితరులు పాల్గొన్నారు.
సంఘం జాతీయ కార్యదర్శి హన్మంతు ముదిరాజ్
పరిగి: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, రాష్ట్ర కన్వీనర్ లాల్‌కృష్ణప్రసాద్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ స్కూల్‌లో బీసీ కుల సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీసీలందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. 42 శాతం రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లు సాధించుకునే వరకు పోరాటం చేయాలన్నారు. ఈ నెల 16న జేఏసీ కమిటీ వేసి బీసీల సంక్షేమానికి కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ జగన్‌మోహన్, బేరి రాంచందర్ యాదవ్, రామాంజనేయులు, రామకృష్ణధనేశ్వర్, శ్రీశైలం, వెంకటయ్య, బచ్చన్న, గోవర్ధన్, అడ్వకేట్లు ఆనందంగౌడ్, సదానందం, ఆంజనేయులు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎంపీ కొండాకు గుండె సంబంధిత శస్త్ర చికిత్స


